ఏపీ దెబ్బ‌కు... బీజేపీ రివ్యూ ఆప్ష‌న్ తీసేసిందే!

Update: 2018-02-05 08:42 GMT
కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి జ‌రిగిన అన్యాయం, ఆ వెంట‌నే క‌నిపించిన తెలుగు ప్ర‌జ‌ల నిర‌స‌న‌ల‌ను క‌ల‌మ‌నాథులు త‌ట్టుకోలేక‌పోయారు. నిజ‌మా? అంటే... నిజ్జంగా నిజ‌మే. ఎలాగంటే... తెలుగు వేడి త‌ట్టుకోలేని బీజేపీ నేత‌లు....ఏకంగా త‌మ పార్టీ అధికారిక ఫేస్ బుక్ పేజీలో రివ్యూ ఆప్ష‌న్‌ను తొలిగించేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకెళితే... రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన నేప‌థ్యంలో లోటు బ‌డ్జెట్ తో ఏర్పాటైన న‌వ్యాంధ్ర తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది. క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా ఏర్పాటైన రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాతో పాటుగా విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్ల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటుగా అడిగిన దాని కంటే కూడా అధికంగానే సాయం చేస్తామ‌ని పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌ధాని హోదాలో మాజీ పీఎం మ‌న్మోహ‌న్ సింగ్ చెప్పారు. దీనికి సాక్షి తామేనంటూ బీజేపీ త‌ర‌ఫున నాడు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ప్ర‌స్తుత ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పుప వెంక‌య్య‌నాయుడు కూడా చాలానే మాట్లాడారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో యూపీఏ స‌ర్కారు గ‌ద్దె దిగ‌గా, న‌రేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికార ప‌గ్గాలు చేప‌ట్టింది. అయితే నాడు పార్లమెంటులో జ‌రిగిన చ‌ర్చ‌ను అధికారంలోకి రాగానే మ‌ర్చిపోయిన బీజేపీ... ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీకి సాయం మాట‌ను దాట‌వేస్తూనే వ‌స్తోంది.

ఇప్ప‌టిదాకా మూడు ఫుల్ ప్లెడ్జ్‌ డ్ బ‌డ్జెట్లు వ‌చ్చినా... ఏపీకి ఒరిగింది చాలా త‌క్కువేన‌ని చెప్పాలి. అంతేకాకుండా ఏపీకి ప్ర‌క‌టిస్తామ‌న్న ప్ర‌త్యేక హోదాను అట‌కెక్కించిన మోదీ స‌ర్కారు... ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించి దానిని కూడా అమ‌లు చేయ‌కుండా నాన్చుడు ధోర‌ణితో ముందుకు సాగుతోంది. దీంతో ఏపీవ్యాప్తంగా నిర‌స‌న‌లు పెల్లుబికినా... త‌న మిత్ర‌ప‌క్షం టీడీపీ అధికారంలో ఉంది క‌దా... ఆ పార్టీనే మొత్తం చూసుకుంటుంది అన్న చందంగా క‌మ‌ల‌నాథులు వ్య‌వ‌హ‌రించారు. తాజాగా త‌న ఐదేళ్ల టెర్మ్‌లో చిట్ట‌చివ‌రి బ‌డ్జెట్‌ను మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ద్వారా మోదీ స‌ర్కారు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బ‌డ్జెట్ లో మ‌రింత దారుణంలో అస‌లు ఏపీ ప్ర‌స్తావ‌న చేసిన పాపాన పోలేదు. దీంతో అన్ని విప‌క్షాల‌తో పాటుగా అధికార పార్టీ అయిన టీడీపీ కూడా గ‌ళం విప్పేందుకు య‌త్నించింది. అయితే రాజ‌కీయ పార్టీల ఆరోప‌ణ‌లు, వాగ్బాణాల‌ను అంత‌గా ప‌ట్టించుకునే ల‌క్ష‌ణం త‌న‌కు లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన బీజేపీ... టీడీపీని బాగానే దువ్వేసింది.

అయితే జ‌నానికి మాత్రం రాజ‌కీయాలు అవ‌స‌రం లేదు క‌దా. ప్ర‌జ‌ల‌కు ఏం కావాలి? అభివృద్ధి మాత్ర‌మే కావాలి. అధికారంలో ఉన్న‌ది ఏ పార్టీ అయినా... అభివృద్ధి లేక‌పోతే వారు విరుచుకుప‌డ‌తారంతే. గతంలో అయితే ఎలా ఉండేదో తెలియ‌దు గానీ.. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో మోదీకి పీఠం ద‌క్క‌డానికి కార‌ణ‌మైన సోష‌ల్ మీడియా ఇప్పుడు మ‌రింత‌గా విస్త‌రించింది. బీజేపీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన సోష‌ల్ మీడియా వేదిక‌గానే... ఇప్పుడు ఆ పార్టీని ఏపీ జ‌నం... ప్ర‌త్యేకించి నెటిజ‌న్లు ముప్పు తిప్ప‌లు పెడుతున్నారు. లోక్ స‌భ‌లో అరుణ్ జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగియ‌గానే మొద‌లైన ఏపీ ప్ర‌జ‌ల నిర‌స‌న‌లు... సోష‌ల్ మీడియాలో అంత‌కంత‌కూ పెరిగిపోయింది. ఈ ప‌రిణామాన్ని ఊహించ‌ని బీజేపీ నేత‌లు త‌మ అధికారిక ఫేస్ బుక్ ఖాతాను చూసి షాక్ తిన్నారు. వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతున్న విమ‌ర్శ‌ల‌ను చూసిన క‌మ‌ల‌నాథులు... ఈ విమ‌ర్శ‌ల‌న్నీ ఒక‌టి, రెండు రోజులే క‌దా అనుకున్నాయి. అయితే ఒక‌టి, రెండు రోజులు కాదు క‌దా... స‌మ‌యం గ‌డుస్తున్న కొద్దీ ఈ తిట్ల పరంపర పెరిగిపోయింది. దీంతో చేసేది లేక బీజేపీ... త‌న ఫేస్ బుక్ పేజీలో బీజేపీ ఏకంగా రివ్యూ ఆప్ష‌న్‌ను తీసేసింది.

నేటి ఉద‌యం దాకా 35,000 మేర శాప‌నార్థాలు చూసిన బీజేపీ నేత‌లు నిజంగానే డంగైపోయారు. వ‌న్ స్టార్ రేటింగ్‌ తో ఏపీ నెటిజ‌న్లు బీజేపీ ఫేస్ బుక్‌ను షేక్ చేశార‌నే చెప్పాలి. ఫ‌లితంగా ఆ పేజీ రేటింగ్‌ 1.1కు ప‌డిపోయింద‌ట‌. ఇంకా ఆల‌స్యం చేస్తే అస‌లుకే మోసం వస్తుంద‌ని భావించినందునే బీజేపీ... ఈ రివ్యూ ఆప్ష‌న్‌ ను తీసేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఫేస్ బుక్ రివ్యూ ఆప్ష‌న్‌ ను తొలగించిన బీజేపీ... ఏపీ ప్ర‌జ‌ల శాప‌నార్థాల నుంచి త‌ప్పించుకుందామ‌నుకుంటే... సోష‌ల్ మీడియాలో మ‌రో కీల‌క వేదిక అయిన ట్విట్ట‌ర్ ద్వారా ఏపీ ప్ర‌జ‌లు త‌మ‌దైన రీతిలో స్పందిస్తూ బీజేపీని ముప్పు తిప్ప‌లు పెడుతున్నారు. #ఏపీ డిమాండ్స్ స్పెష‌న్ స్టేట‌స్‌, #వియి వాంట్ రైల్వే జో్న్ ఫ‌ర్ వైజాగ్‌ - #బ‌డ్జెట్ నెగ్లెక్ట్స్ ఏపీ - #స్టాండ్ ఫ‌ర్ ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్.. త‌ర‌హా హ్యాష్ ట్యాగ్‌ ల ద్వారా ఏపీ ప్ర‌జ‌లు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల వ‌ర్షం నుంచి బీజేపీ ఎలా త‌ప్పించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News