కాంగ్రెస్ చూపిన `రిసార్ట్` బాట‌లోనే బీజేపీ!

Update: 2018-05-19 08:32 GMT
ఎవ‌రు త‌వ్వుకున్న గోతిలో వారు ప‌డ‌తార‌న్న చందంగా ఉంది కాంగ్రెస్ ప‌రిస్థితి. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతోన్న ప‌రిణామాలపై గ‌గ్గోలు పెడుతోన్న కాంగ్రెస్....ఆ సంస్కృతిని మొద‌లు పెట్టింది తామే అన్న సంగ‌తి మ‌ర‌చిపోతోంది. రాజ్యాంగ స్ఫూర్తికి గ‌తంలో పాత‌ర వేసిన కాంగ్రెస్....ఇపుడు బీజేపీని విమ‌ర్శిస్తోంది. రిసార్ట్ రాజ‌కీయాల‌కు నాంది ప‌లికిన కాంగ్రెస్....అవే రాజ‌కీయాల‌కు తాము బ‌లికావ‌డం పై ర‌చ్చ చేస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే గుజ‌రాత్ లోని 40 మంది ఎమ్మెల్యేల‌ను క‌ర్ణాట‌క త‌ర‌లించిన సంగ‌తిని కాంగ్రెస్ మ‌ర‌చిపోయింది కాబోలు. అంత‌కుముందు, 1996లో గుజ‌రాత్ లో బీజేపీని ముక్కలుగా చేసేందుకు ఇదే ద‌మ‌న‌నీతిని కాంగ్రెస్ అనుస‌రించింది. కాక‌తాళీయంగా అప్ప‌టి ప్ర‌ధాని దేవెగౌడ గుజ‌రాత్ లో బీజేపీ స‌ర్కార్ ను బ‌ర్త‌ర‌ఫ్ చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వి కోల్పోయిన ఇప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా....అదును చూసి జేడీఎస్ ను దెబ్బ‌కొడుతున్నారు.

క‌న్న‌డ‌నాట రిసార్ట్ రాజ‌కీయాల‌పై ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ్యాంగ స్ఫూర్తికి బీజేపీ విఘాతం క‌లిగిస్తోంద‌ని - ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంద‌ని మండిప‌డ్డారు. అంతేకాకుండా, దాయాది దేశం పాక్ లో మాత్ర‌మే ఈ త‌ర‌హా కుట్ర‌లు జ‌రుగుతాయ‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ గ‌త చ‌రిత్ర‌ను కొంత‌మంది వేలెత్తి చూపిస్తున్నారు. గ‌త జులైలో గుజ‌రాత్ నుంచి 40 మంది ఎమ్మెల్యేల‌ను క‌ర్ణాట‌క త‌ర‌లించ‌డం - 1996లో గుజ‌రాత్ లో భాజ‌పాను చీల్చేందుకు కుట్ర ప‌న్న‌డం వంటి ఘ‌ట‌న‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌లుగా చూపుతున్నారు. దేవెగౌడ ఉదంతం క‌న్నా ముందే చ‌ర‌ణ్ సింగ్ హ‌యాంలో కూడా బీజేపీని కాంగ్రెస్ ఇదే త‌ర‌హాలో దెబ్బ‌కొట్టింద‌ని ఆరోపిస్తున్నారు. గురివింద న‌లుపు దానికి తెలీద‌న్న త‌ర‌హాలో రాహుల్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎద్దేవా చేస్తున్నారు. గ‌తంలో త‌మ పార్టీ చేసిన క్యాంపు రాజ‌కీయాల‌ను ఆత్మావ‌లోక‌నం చేసుకోవాల‌ని హిత‌వు పలుకుతున్నారు.

అప్పుడు కాంగ్రెస్ కూడా బీజేపీ త‌ర‌హాలోనే కుటిల రాజ‌కీయాలు చేసిన మాట అంగీక‌రించాల్సి వాస్త‌వం. అయితే, క‌ర్ణాట‌క‌లో బీజేపీ చేస్తోన్న కుట్ర‌ల‌పై కాంగ్రెస్ - జేడీఎస్ తో పాటు చాలామంది అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డానికి వేరే కార‌ణాలున్నాయి. గోవా - మ‌ణిపూర్ - బిహార్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ల‌ను ప‌క్క‌న పెట్టి....బీజేపీకి గ‌వ‌ర్న‌ర్ అధికారం క‌ట్ట‌బెట్టారు. అదే, క‌ర్ణాట‌క విష‌యంలో మాత్రం....104 స్థానాలున్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీకి ప‌ట్టం క‌ట్టేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు. ప‌క్క రాష్ట్రాల‌లో ఒక విధంగా....క‌ర్ణాట‌క‌లో ఒక విధంగా త‌మ‌కు న‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డంపైనే చాలామంది అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. బీజేపీ ద్వంద్వ ప్ర‌మాణాల‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ లాజిక్ ఆధారంగానే బీజేపీని నిల‌దీస్తున్నారు. ఈ నేప‌థ్యంలో  నేడు సాయంత్రం బ‌ల ప‌రీక్ష‌లో ఎవ‌రు నెగ్గుతార‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. 
Tags:    

Similar News