రెడ్ హ్యాండెడ్‌ గా దొరికినందుకే..నోరు మెద‌ప‌ట్లే!

Update: 2017-09-19 08:09 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌థ‌కం కావ‌డం, అందులోనూ ఆయ‌న త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ శాఖ‌ కావ‌డం ... పైగా సీఎం కేసీఆర్ త‌న‌య అయిన ఎంపీ క‌వితకు ప్రీతిపాత్ర‌మైన బ‌తుక‌మ్మ పండుగ నేప‌థ్యంలో ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కం కావ‌డంతో విప‌క్షాల‌న్నీ తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన చీర‌ల పంపిణీపై దృష్టి సారించాయి. అయితే చీర‌ల పంపిణీ అనేక చోట్ల వివాదాస్ప‌దంగా మారిన తీరుతో అధికార పార్టీ ఇర‌కాటంలో ప‌డిన సంగ‌తి తెలిసిందే.  దీంతో ప్ర‌తిపక్షాల‌న్నీ ఈ సంఘ‌ట‌న‌ల‌ను అస్త్రంగా చేసుకున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను - టీఆర్ ఎస్ పార్టీని ఇర‌కాటంలో ప‌డేసేందుకు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

ఈ ప‌రిణామాల‌పై బీజేపీ స్పందించింది. సీఎం కేసీఆర్ గొప్ప‌లు చెప్పిన‌ చీరల పంపిణి అట్టర్ ప్లాప్ అయింద‌ని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ఎద్దేవా చేశారు. మహిళలకు బతుకమ్మ పెద్ద పండుగ అని పేర్కొంటూ ఆ పండుగ సంద‌ర్భంగా మహిళలకు చీర ఆశ చూపించి అవమానపరిచారని మండిప‌డ్డారు. ఎక్కువ ధ‌ర‌కు బిల్లులు విడుద‌ల చేసి...నాసిరకం చీరల పంపిణి చేయ‌డం ద్వారా సీఎం కేసీఆర్ అవినీతిని ప్రజలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని కృష్ణ‌సాగ‌ర్ రావు అన్నారు. అందుకే ఇంత జరిగినా సీఎం కేసీఆర్ నోరు తెరవడం లేద‌ని ఎద్దేవా చేశారు. చీరల కోసం లైన్లో నిలబడి మహిళలు బేజార్‌ అవుతున్నార‌ని కృష్ణ‌సాగ‌ర్ రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చీరల పట్ల కోపంతోనే మహిళలు చీరలను దగ్ధం చేశార‌ని ఆయ‌న తెలిపారు.

చీరల పేరిట పెద్ద ఎత్తున‌ అవినీతి జరిగిందని ఆరోపించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఒక్క పక్క చేనేత కార్మికులను వంచిస్తూ మ‌రో ప‌క్క మ‌హిళ‌ల‌ను అవ‌మానం పాలు చేశార‌ని అన్నారు. ఏ చేనేత కార్మికుల దగ్గర కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చీరల కుంభకోణంఫై సిటింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఆయ‌న కోరారు. కేసీఆర్ మౌనం వల్ల అసమర్దతను ఒప్పుకునట్లేన‌ని అందుకే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త‌న శాఖ ద్వారా జ‌రిగిన నిర్వాకంపై మంత్రి కేటీఆర్ విప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌టం కంటే ప‌రిష్కారాలు చూప‌డం ఉత్త‌మ‌మ‌ని అన్నారు.
Tags:    

Similar News