ఆరు నెల‌ల్లో తెలంగాణ‌భ‌వ‌న్‌ కు టులెట్‌

Update: 2017-09-22 16:02 GMT
తెలంగాణ‌లో రాజ‌కీయాల గురించి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు - ఎమ్మెల్యే డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఆస‌క్తిక‌ర‌మైన జోస్యం చెప్పారు. తెలంగాణ‌లో అధికార కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న బీజేపీ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై ఎదురుదాడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో చేరిక‌ల‌ను సైతం ప్రోత్స‌హిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా సిద్దిపేట నుంచి చెలువూరి ప్రభాకర్ రెడ్డి...ఆయన అనుచరులు - కుత్బుల్లాపూర్ నుంచి సామల వెంకటేష్ ఆయన అనుచరులు ల‌క్ష్మ‌ణ్ స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు.. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అవినీతి పెచ్చుపెరిగి పోయినట్లే తెరాస పాలనలోనూ అవినీతి పెరుగుతోందని మండిప‌డ్డారు. తెరాస అహంకారపూరిత పాలనతో విసిగిన పౌరులు ఆగ్రహంలో ఉన్నారని తెలిపారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులపై దాడులు చేసినవారికి పదవులు కట్టబెడుతున్న తెరాస నిజమైన ఉద్యమకారులను విస్మరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమ‌ర్శించారు. అందుకే తెరాస కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని తెలిపారు. తెలంగాణా వచ్చాక ఆత్మహత్యలు ఉండవు అనుకున్నామని.. కానీ ప్రభుత్వ వైఖరి వల్ల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీఆర్ ఎస్‌ కు బీజేపీ మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయమ‌ని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణ పనుల్లో కనీస పర్యవేక్షణ లేదని ప్రమాదకర పరిస్థితుల్లో కార్మికులు పని చేస్తున్నారని ల‌క్ష్మ‌ణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం పేరుతో అంచనాలు పెంచేశారని ఆరోపించారు.

యూపీ - అస్సాం తరహాలోనే 2019లో తెలంగాణలో గెలుస్తామ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ధీమా వ్య‌క్తం చేశారు. టీఆర్ ఎస్‌ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాలుగో స్థానానికే పరిమితం అవుతోందని ఇక్క‌డ కూడా అదే జ‌ర‌గ‌నుంద‌ని చెప్పారు. కాంగ్రెస్ ముక్త భారత్ లో భాగంగా... తెరాస ముక్త తెలంగాణ సాధిస్తామ‌ని ప్ర‌క‌టించారు. భవిష్యత్ లో హేమాహేమీలు బీజేపీలో చేరబోతున్నారని జోస్యం చెప్పారు.
Tags:    

Similar News