బీజేపీ ప్లాన్ బి చెప్పిన రాంమాధ‌వ్‌

Update: 2018-12-27 10:40 GMT
బీజేపీ సీనియ‌ర్ నేత‌.. మోడీకి అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల్లో ముఖ్య‌మైన వ్య‌క్తిగా చెప్పే రాంమాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ పాలిత మూడు రాష్ట్రాల్లో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రాజ‌యం కావ‌టం.. మ‌రికొద్ది నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఎన్డీయే కూట‌మికి సంబంధించి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ఆస‌క్తిని మ‌రింత పెంచేలా మారాయి.

ఓవైపు మోడీ తీరును త‌ప్పు ప‌డుతూ ఎన్డీయే కూట‌మికి చెందిన ప‌లు పార్టీలు ఒక్కొక్క‌టిగా ఎవ‌రి దారిన వారు పోతున్న తీరుకు క‌మ‌ల‌నాథులు పెద్ద‌గా క‌ల‌వ‌ర‌ప‌డ‌టం లేద‌న్న విష‌యం రాంమాధ‌వ్ మాట‌ల్లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. మిత్ర‌ప‌క్షాల నుంచి.. సొంత పార్టీలో లుక‌లుక‌లు పెరుగుతున్న వేళ‌.. వీటికి చెక్ పెట్టే ప్లాన్ బి త‌మ ద‌గ్గ‌ర ఉంద‌న్న రీతిలో రాంమాధ‌వ్ వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

కూట‌మి రాజ‌కీయాల్లో స‌ర్దుబాట్లు స‌హ‌జ‌మ‌ని.. అలాంటి వాటికి బీజేపీ సైతం సిద్ధంగా ఉంద‌న్న ఆయ‌న‌.. రానున్న రోజుల్లో తాము కొత్త పార్టీల‌తో జ‌త క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. అయితే.. అలా చేరేపార్టీలు ఏవ‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్పలేదు. కొత్త మిత్రులు ద‌క్షిణాదితోపాటు.. ఈశాన్య భార‌తం నుంచి ఉంటార‌న్న మాట‌ను ఆయ‌న చెప్పారు. ఎన్నిక‌ల ముందు చేరిక‌లు స‌హ‌జ‌మ‌న్న‌ట్లుగా ఆయ‌న మాట్లాడారు.జాతీయ స్థాయిలో బీజేపీ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటుంద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. దానికి చెక్ పెట్టేలా త‌మ ద‌గ్గ‌ర ప్లాన్ బి ఉంద‌న్న విష‌యాన్ని రాంమాధ‌వ్ చెప్ప‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి.. ద‌క్షిణాదినుంచి బీజేపీతో జ‌త క‌ట్టే పార్టీలు ఏమిట‌న్న‌ది ఇప్పుడు కొత్త ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News