ముదురుతున్న నీటి యుద్ధం.. బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2021-07-03 08:55 GMT
రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం ముదురుతోంది. ఏపీ అక్ర‌మ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందుకు నిర‌స‌న‌గా.. తెలంగాణ స‌ర్కారు ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. శ్రీశైలంతో పాటు.. నాగార్జున సాగ‌ర్‌, దాని కింద ఉన్న పులిచింత ప్రాజెక్టులోనూ విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టడంతో వివాదం మ‌రింత పెరిగింది. విద్యుత్ ఉత్ప‌త్తికి విఘాతం క‌ల‌గ‌కుండా పోలీసుల‌ను సైతం భారీగా మోహ‌రించింది తెలంగాణ స‌ర్కారు.

ఈ నేప‌థ్యంలోనే.. సాగ‌ర్ లో విద్యుత్ ఉత్ప‌త్తిని ఆపాల‌ని విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు వెళ్లిన‌ ఏపీ అధికారుల‌ను.. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. కృష్ణాన‌ది జ‌ల వివాదాన్ని కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ.. కేంద్రం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు. క‌నీసం జ‌ల‌శ‌క్తి మంత్రికూడా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. కృష్ణా బోర్డు మాత్రం.. ఈ నెల 9న రెండు రాష్ట్రాల అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఏపీకి లేఖ రాసింది.

అయితే.. అప్ప‌టిలోగా విద్యుత్ ఉత్ప‌త్తి ఇలాగే కొన‌సాగితే.. ఉన్న నీరంతా స‌ముద్రం పాల‌య్యే అవ‌కాశం ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే.. మూడు ప్రాజెక్టుల్లోనూ క‌రెంట్ త‌యారు చేస్తుండ‌డంతో.. నీళ్ల‌న్నీ కింద‌కు వెళ్లిపోతున్నారు. ఆ విధంగా వ‌చ్చిన నీటితో ప్ర‌కాశం బ్యారేజ్ మొత్తం నిండిపోవ‌డం.. అనివార్యంగా గెట్టు ఎత్తేయాల్సి రావ‌డంతో.. నీరు స‌ముద్రంలో క‌లిసిపోతోంది.

దీనిపై.. ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ చ‌ర్య‌ల కార‌ణంగా.. వేల క్యూసెక్కుల నీరు వృథాగా స‌ముద్రంలో క‌లిసిపోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆంధ్రారైతులపై క‌డుపు మంట‌తోనే.. కావాల‌నే కేసీఆర్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 7,400 క్యూసెక్కుల నీరు దిగువ‌కు వ‌స్తోంద‌ని, దీంతో.. ప్ర‌కాశం బ్యారేజీ నుంచి ఐదు గేట్లు ఎత్తి 8,600 క్యూసెక్కుల నీటిని స‌ముద్రంలోకి విడుద‌ల చేసిన‌ట్టు చెప్పారు.

ఇది కేవ‌లం ఆంధ్రా రైతుల‌కు చేస్తున్న ద్రోహం మాత్ర‌మే కాద‌ని, యావ‌త్ దేశ రైతులంద‌రికీ చేస్తున్న ద్రోహ‌మ‌ని అన్నారు. నేటి స‌మాజం హిట్ల‌ర్ ను చూడ‌లేద‌ని, హిట్ల‌ర్ రూపంలో ఉన్న కేసీఆర్ ను తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగాచూస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ అనైతిక, అహంకార‌, పిచ్చి చ‌ర్య‌ల‌ను చ‌రిత్ర మ‌రిచిపోద‌ని, రైతు ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు విష్ణు.

https://twitter.com/SVishnuReddy/status/1411167103550328833
Tags:    

Similar News