ఏపీలో ప్రజలు కోరుతున్న పొత్తు అదేనట...?

Update: 2022-10-23 13:57 GMT
ఏపీ జనాలు ఎన్నికల్లో తమ అభిప్రాయాన్ని  ఓట్లు వేసి తీర్పు ఇస్తారు. వారే కాదు దేశంలోనూ ప్రపంచంలోనూ జరిగేది ఇదే. అయితే ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఎలా రావాలి. వారి వ్యూహాలు ఎలా ఉండాలి ఇవన్నీ సాధారణంగా ప్రజలకు పట్టని విషయాలు. వారికి అసలు అవసరం లేని విషయాలు కూడా. అయితే ఇటీవల అతి ఉత్సాహంతో కొందరు వీటి మీద సర్వేలు చేస్తున్నారు. జనాలు తమకు అప్పటికపుడు తోచిన దాన్ని సమాధానంగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేగా చేసిన బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అయితే ఏపీలో టీడీపీ జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉండాలని అంటున్నారు.

అంతే కాదు ఈ విషయంలో ఆయన మరో అడుగు ముందుకేసి ఇది జనాలు కోరుకుంటున్న పొత్తు అని కూడా స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఏపీ ఇంచార్జి సునీల్ డియోధర్ ఈ విషయం మీద జనాభిప్రాయాన్ని తెలుసుకోవాలని బీజేపీ నేత సూచించడం విశేషం.   కొన్ని సార్లు సొంత అజెండాని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలని ఆయన అంటున్నారు.

నిజానికి బీజేపీలో పొత్తుల వ్యవహారం ఏపీ నేతలు కాదు ఢిల్లీ పెద్దలు నిర్ణయిస్తారు. బీజేపీ లాంటి పార్టీలలో ఏ నాయకుడు అయినా మీడియాకు ఎక్కి తమ సొంత అభిప్రాయాలను బయట పెట్టరు, ఇప్పటికే సోము వీర్రాజు మీద మాజీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు చేసిన విషయం మీద హై కమాండ్ గుర్రు మీద ఉంది అంటున్నారు. మరి ఇపుడు విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ విష్ణు కుమార్ రాజు ఏకంగా పొత్తుల మీద హై కమాండ్ కి సూచనలు ఇస్తున్నారు.

ఆయన సునీల్ డియోధర్ ని ఉద్దేశించి అభిప్రాయాలు మార్చుకోవాలని మాట్లాడుతున్నారు.మరి దీన్ని బీజేపీ హై కమాండ్ ఎలా చూస్తుందో ఆలోచించాలి. విష్ణు కుమార్ రాజు 2014లో బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారు ఎవరూ పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లడరు, ఒకవేళ మీడియా అడినా హై కమాండ్ అన్నీ చూస్తుంది అని ఒక్క మాటతో తేల్చేస్తారు.

మరి విష్ణు అయితే మూడు పార్టీల పొత్తు కావాలంటున్నారు. నిజానికి అలా జరిగితే తాను మళ్ళీ ఎమ్మెల్యే కావచ్చు అన్నది ఆయన ఆలోచన. అయితే హై కమాండ్ నిర్ణయం తీసుకుంటే తప్పు లేదు కానీ సలహాలు బహిరంగంగా ఇవ్వడం, ప్రజలు ఏమనుకుంటున్నారో చూడండి అని చెప్పడం వంటివి బీజేపీ ఏ విధంగా చూస్తుంది అన్నదే ఇక్కడ పాయింట్. మరి విష్ణు ఒక్కరేనా ఇలాంటి వాదనతో ఎంత మంది నాయకులు ఉన్నారు, వారు కూడా మీడియా ముందుకు వస్తారా అన్నది చూడాలి. మొత్తానికి పవన్ చంద్రబాబు భేటీ కాదు కానీ బీజేపీలో మాత్రం వేడి బాగానే రాజుకుంటోంది.
Tags:    

Similar News