సాగ‌ర్‌లో చెల్ల‌నివాళ్లు.. తిరుప‌తిలో చెల్లుతారా?

Update: 2021-04-03 16:30 GMT
బీజేపీ నాయ‌కుల రాజ‌కీయంగా చిత్రంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేత‌లు వేస్తున్న రాజ‌కీయ ఎత్తుల‌పై సోష‌ల్ మీడియాలో స‌టైర్లు పేలుతున్నాయి. మ‌రికొంద‌రు నేరుగానే విమ‌ర్శిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణ‌లో కొన్నాళ్ల కింద‌ట దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగింది. దీనిలో బీజేపీ హోరాహోరీ పోరాడి.. కీల‌క నేతైన ర‌ఘునంద‌న్‌రావుకు టికెట్ ఇచ్చి.. విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శించి.. మెజారిటీ స్థానాల‌ను ద‌క్కించుకుని.. అధికార టీఆర్ ఎస్‌కు చుక్క‌లు చూపించింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

ఇక‌, దీనిని చూసుకుని.. తెలంగాణ ప్ర‌జ‌లు బీజేపీ ప‌ట్టం క‌డుతున్నార‌ని.. నాయ‌కులు మురిసిపోయారు. అయితే... ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మాత్రం బీజేపీ చ‌తికిల ప‌డింది. హోరా హ‌రో పోరు సాగినా.. బీజేపీ అభ్య‌ర్థి ఓడిపోయారు. దీంతో బీజే పీ సాధించిన రెండు విజ‌యాలు.. ఈ ఒక్క ఓట‌మితో ఒకింత వెనుక‌బ‌డిన‌ట్టే అనిపించింది. ఇక‌, ఇప్పుడు మ‌రో ఉప ఎన్నిక జ‌రుగుతోంది. నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఈ నెల 17న ఉప ఎన్నిక జ‌రుగుతోంది. దీనికి సంబంధించి అభ్య‌ర్థులు ఎంద‌రో పోటీలో ఉన్నా.. పైగా జ‌న‌ర‌ల్ స్థానం అయినా.. ఎస్టీ సామాజిక వ‌ర్గానికిచెందిన నేత‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీనిని గొప్ప‌గా ప్ర‌చారం కూడా చేసుకుంది.

అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. స‌ద‌రు అభ్య‌ర్థి గెలుపు కోసం.. నాయ‌కులు ప్ర‌య‌త్నించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నా యి. ఎవ‌రూ కూడా ఆయ‌న‌ను గెలిపించాల‌నే లక్ష్యంతో ముందుకు సాగ‌డం లేద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ప్ర‌చారం చేసుకునే వారు కూడా ఇప్పుడు అక్క‌డ ప్రచారం చేయ‌డం లేదు. ఆయ‌న‌ను అక్క‌డే వ‌దిలేసి.. వారు మాత్రం ఇప్పుడు తిరుప‌తిలో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో అన్ని రాజ‌కీయ ప‌క్షాల వైఖ‌రుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న నెటిజ‌న్లు.. ఇదే విష‌యంపై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ``సాగ‌ర్‌లో చెల్ల‌ని రూపాయి.. తిరుప‌తిలో చెల్లుతుందా? `` అని నిల‌దీస్తున్నారు.

నిజానికి బీజేపీ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. తెలంగాణ‌లో మంచి కేడ‌ర్ ఉంది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. క‌నీసం వార్డు స్థాయిలో కూడా పార్టీకి బ‌ల‌మైన వ్య‌క్తులు లేర‌నే చెప్పాలి. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా చెప్పుకొంటున్న‌వారు ఇక్క‌డ ఏం చేస్తారు? అనే ప్ర‌శ్న నెటిజ‌న్ల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముందు సాగ‌ర్‌లో గెలిపించుకోకుండా.. అక్క‌డ కాంగ్రెస్‌తో లాలూచీ రాజ‌కీయం చేసుకుని.. ఇక్క‌డ తిరుప‌తిలో చ‌క్క‌ర్లు కొట్ట‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అడిగితే.. అది అయిపోయిన స‌బ్జెక్టు అని అంటున్న బీజేపీ నేత‌లు.. ఇక్క‌డ ఏ మొహం పెట్టుకుని ప్ర‌చారం చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. బీజేపీని కోల్డ్ స్టోరేజీలో పెట్టాల‌ని.. నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.




Tags:    

Similar News