బీజేపీ..ఢిల్లీలో అలా మొద‌లుపెట్టి - చివ‌రికి ఇలా!

Update: 2020-02-11 22:30 GMT
స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి - ఆపై కేంద్ర హోం శాఖా మంత్రి - ఇంకా డ‌జ‌ను మందికి పైగా కేంద్ర మంత్రులు - వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. యోగీ ఆదిత్య‌నాథ్ - ఇంకా ఎక్క‌డెక్క‌డి బీజేపీ నేత‌లు.. అంతా ఢిల్లీలో పాగా వేశారు. నెల రోజుల పాటు రాజ‌కీయ వాడీవేడీ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ప్ర‌త్య‌ర్థుల‌ను దూషించారు - దేశ‌ద్రోహులున్నారు - కేజ్రీవాల్ ను అయితే మామూలుగా టార్గెట్ చేయ‌లేదు. ఆయ‌న‌ను ఏకంగా టెర్ర‌రిస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ఉగ్ర‌వాదే అని కేంద్ర మంత్రులు నొక్కివ‌క్కాణించారు! త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను పాకిస్తాన్ సానుభూతి ప‌రులు అన్న‌ట్టుగా.. ఎంత ప్ర‌చారం చేయాలో.. అంత‌కు వంద రెట్ల ఎక్కువ ప్ర‌చారం చేశారు క‌మ‌ల‌నాథులు!

అయితే అంత క‌ష్ట‌ప‌డినా.. త‌మ‌కు 45 ఎమ్మెల్యే సీట్ల‌కు త‌గ్గ‌కుండా వ‌స్తాయ‌ని అమిత్ షా ప్ర‌చార ప‌ర్వంలో ప్ర‌క‌టించినా, ఢిల్లీలో బీజేపీ గెలుపు ప‌వ‌నాలు వ‌స్తున్నాయ‌ని శ్రీమాన్ న‌రేంద్ర‌మోడీ ప్ర‌చారంలో నొక్కివ‌క్కాణించినా.. ఆప్ సుడిగాలిలో బీజేపీ చిత్తు అయ్యింది.

ఒక‌వేళ కొద్దో గొప్పో సీట్ల‌ను సాధించుకుని ఓడిపోయి ఉంటే బీజేపీ ఎలాగోలా ప‌రువు కాపాడుకున్న‌ట్టే అయ్యేదేమో. అయితే ఢిల్లీలో బీజేపీ క‌థ మ‌రీ సింగిల్ డిజిట్ క‌హానీగా మార‌డ‌మే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం. కౌంటింగ్ లో ఒక ద‌శ‌లో బీజేపీ రెండంకెల నంబ‌ర్ సీట్ల స్థాయిలో లీడ్ లో క‌నిపించింది. క‌నీసం 15 సీట్లు అయినా నెగ్గేలా క‌నిపించింది క‌మ‌లం పార్టీ. అయితే కౌంటింగ్ రౌండ్స్ పూర్త‌య్యే కొద్దీ బీజేపీ రేంజ్ త‌గ్గిపోయింది. చివ‌రి రౌండ్స్ కు వ‌చ్చే స‌రికి బీజేపీ ఏడంటే ఏడు సీట్ల‌లో మాత్ర‌మే లీడ్ కు ప‌రిమితం అయ్యింది.

ఐదేళ్ల కింద‌టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 3 సీట్ల‌ను సాధించింది. ఇప్పుడు ఏడింట లీడ్ లో క‌నిపిస్తూ ఉంది. ఐదేళ్ల పోరాటం, ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ ఆరాటం.. ఇవ‌న్నీ క‌లిసి కేవ‌లం నాలుగంటే నాలుగు అసెంబ్లీ సీట్ల‌ను మాత్రం దానికి అద‌నంగా క‌ట్ట‌బెట్ట‌డం గ‌మ‌నార్హం!


Tags:    

Similar News