కేసీఆర్ ప్ర‌త్యర్థులు మ‌ళ్లీ ఏకం అయ్యారు

Update: 2015-12-12 11:03 GMT
తెలంగాణ రాష్ర్టంలో రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దాటికి త‌ట్టుకోలేక విల‌విల్లాడుతున్న ప్ర‌తిప‌క్షాలు ప‌లు అంశాల మీద ఏక‌తాటిపై పోరాడిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇపుడు ప్ర‌భుత్వం బెదిరింపుల‌పై ఒక్క‌ట‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్సీ ష‌బ్బీర్ అలీకి బెదిరింపు కాల్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 040-69542335 ల్యాండ్ నంబ‌ర్ నుంచి కాల్ వ‌చ్చింద‌ని పేర్కొంటూ...తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు మానుకోకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించి ష‌బ్బీర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడితే చంపుతామ‌ని బెదిరించార‌ని ష‌బ్బీర్ ఇచ్చిన ఫిర్యాదు నేప‌థ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు స్వీక‌రించి విచార‌ణ జ‌రుపుతున్నారు.

ష‌బ్బీర్‌కు వ‌చ్చిన  బెదిరింపు ఫోన్‌కాల్‌తో తెలంగాణలో ప్రతిపక్షాలను ఏకం అవుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత, తెలంగాణలో ఆ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత లక్ష్మణ్ షబ్బీర్ అలీని కలిశారు. బెదిరింపులపై ఆరా తీశారు. అండగా ఉంటామని షబ్బీర్ అలీకి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ఆరోపణలు చేస్తే చంపేస్తామని బెదిరింపులు వస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించదని ఆయన ప్రశ్నించారు. బెదిరింపులను ఇక ఎంతమాత్రం సహించబోమని ఆయన ప్రకటించారు.మొత్తంగా తెలంగాణ ప్ర‌భుత్వం పేరుతో జ‌రుగుతున్న చ‌ర్య‌లు కొత్త రూపం దాల్చిఆ ప్ర‌భుత్వానికే చెడ్డ‌పేరు తీసుకువ‌చ్చేలా...ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేసేలా మార‌టం అధికార‌పార్టీకి ఇరుకున పెట్టే ప‌రిణామ‌మేన‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.
Tags:    

Similar News