రేవంత్ విష‌యంలో బీజేపీకి ఇంకా ఆశ‌లున్నాయా?

Update: 2017-10-20 13:21 GMT
తెలంగాణ టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేరువ అవుతుండ‌టం ఒక్క లెఫ్ట్ పార్టీలు మిన‌హా...అన్ని పార్టీల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కాంగ్రెస్‌కు స‌న్నిహితంగా ఇంకా చెప్పాలంటే... కండువా క‌ప్పుకోవ‌డం ఒక్క‌టే మిగిలిపోయింది అన్న‌ట్లుగా రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ లో రేవంత్‌ చేరిక ఖ‌రారు అయిపోయిన‌ప్ప‌టికీ... బీజేపీ ఇంకా ఆయ‌న విష‌యంలో ఉత్సుక‌త‌తో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. బీజ‌పీకి చెందిన సీనియ‌ర్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశ‌యింది.

తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై దృష్టిసారించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఏప్రిల్‌ లో హైద‌రాబాద్ ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలోనే రేవంత్‌ రెడ్డి ఆయనతో భేటీ అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అమిత్ షా స‌మక్షంలో టీడీపీ - కాంగ్రెస్‌ - టీఆర్‌ ఎస్‌ నేతలు పలువురు ఆయన సమక్షంలో బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేత‌లు ఊద‌ర‌గొట్టారు. అదే సమయంలో రేవంత్‌ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, కార‌ణాలు ఏవైనా ఆ చేరిక జ‌ర‌గ‌లేదు. కొన్నినెల‌ల గ్యాప్ త‌ర్వాత అనూహ్య రీతిలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రేవంత్ రెడ్డి డిసైడ‌యిపోయారు. రేవంత్ స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ...ఢిల్లీలో ఆయ‌న కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు ఇలా కొన‌సాగుతుండ‌గానే...అయన బీజేపీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

ఒకవేళ కాంగ్రెస్ లో సముచిత స్థానం కల్పించకపోతే బీజేపీలోకి వెళ్ళడానికి కూడా రేవంత్ సిద్దమయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బీజేపీ అధిష్టానానికి స‌న్నిహితుడిగా ముద్ర‌ప‌డిన ఎన్వీఎస్ ఎస్ ప్ర‌భాక‌ర్ రేవంత్‌ తో భేటీ అయిన‌ట్లు అంచ‌నాలు వేస్తున్నారు. అయితే ఈ భేటీకి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని బీజేపీ ఎమ్మెల్యే చెప్ప‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News