ముస్లిం కుటుంబాన్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే!

Update: 2017-07-25 11:42 GMT
సాధార‌ణంగా రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి సాయం చేసేందుకు కొంత‌మంది ముందుకు రారు. కొద్దిమంది 100 కి ఫోన్ చేసి స‌మాచారాన్ని అందించ‌డం వంటివి చేస్తుంటారు. కానీ, ఓ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ముస్లిం కుటుంబానికి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సాయం చేశారు. అంతేకాకుండా, వారికి తోడుగా అంబులెన్స్ లో వెళ్లి ఆసుపత్రిలో సుమారు 3 గంట‌ల పాటు ఉన్నారు. అత్యంత ముఖ్య‌మైన స‌మావేశానికి వెళ్ల‌కుండా వారికి సాయం చేశారు. ఈ ఘ‌ట‌న ఆగ్రా-లక్నో జాతీయ ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం జ‌రిగింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే విపిన్ సింగ్ డేవిడ్ విధాన స‌భ‌కు వెళుతున్నారు. మార్గ మ‌ధ్యంలో ఆగ్రా-ల‌క్నో జాతీయ ర‌హ‌దారిపై ఒక కారు డివైడ‌ర్ ను ఢీకొట్టి ప్ర‌మాదానికి గుర‌వ‌డాన్ని గ‌మ‌నించారు. అప్ప‌టికే ఆ కారులో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ మ‌ర‌ణించగా, మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విపిన్ త‌న బాడీగార్డ్ - డ్రైవ‌ర్ తో పాటు ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి క్ష‌త‌గాత్రుల‌కు మంచినీళ్లు ఇచ్చి - వారికి ధైర్యం చెప్పారు. అక్క‌డ సుమారు 45 నిమిషాలు వేచి చూసిన త‌ర్వాత పోలీస్ రెస్పాన్స్‌ వెహిక‌ల్ - అంబులెన్స్‌ వ‌చ్చి క్ష‌త‌గాత్రుల‌ను ల‌క్నోలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి తీసుకెళ్లాయి. అంబులెన్స్ లో క్ష‌త‌గాత్రుల‌తో పాటు ఎమ్మెల్యే కూడా ఆసుప‌త్రికి వెళ్లారు. సుమారు మూడు గంట‌ల‌పాటు అక్క‌డే ఉండి క్ష‌త‌గాత్రుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

తాను ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లే స‌రికి అంద‌రూ 100 కు డ‌య‌ల్ చేస్తున్నార‌ని విపిన్ తెలిపారు. క్ష‌త‌గాత్రుల గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌న్నారు. గాయ‌ప‌డిన వారిని కాపాడాల‌న్న‌దే త‌నకు ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం అనిపించింద‌ని, అందుకే అత్యంత ముఖ్య‌మైన స‌మావేశానికి కూడా హాజ‌రు కాకుండా వారితో పాటు అంబులెన్స్ లో వెళ్లి, ఆసుప‌త్రిలో 3 గంట‌ల‌పాటు ఉండిపోయాన‌ని ఆయ‌న తెలిపారు. మ‌తం క‌న్నా మాన‌వ‌త్వం గొప్ప‌ద‌ని, గాయ‌ప‌డిన వారు ఏ మ‌తం వార‌నేది త‌న‌కు అన‌వ‌స‌ర‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఆ కుటుంబాన్ని కాపాడిన ఎమ్మెల్యేపై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News