థియేట‌ర్లు త‌గ‌ల‌బెడ‌తామంటున్న ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే

Update: 2017-11-06 16:46 GMT
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మ‌రోమారు అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. హైదరాద్‌లోని గోషా మహల్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజాసింగ్ రాజాస్థాన్‌ లో వివాదానికి కార‌ణ‌మైన ప‌ద్మావ‌తి సినిమా గురించి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సికింద్రాబాద్‌ లోని రాజ్‌ పుత్ కమ్యూనిటీతో మాట్లాడిన సందర్భంగా ఆయ‌న‌ పద్మావతి మూవీపై విరుచుకుపడ్డారు.పద్మావతి సినిమాను ముందుగానే రాజ్‌ పుత్‌ లకు చూపించి.. వాళ్ల అనుమతి తీసుకోకుండా రిలీజ్ చేస్తే.. ఆ సినిమా ప్రదర్శించే థియేటర్లను తగులబెడుతామని హెచ్చరించారు.

ఫేస్‌ బుక్ లోని త‌న అధికారిక‌ పేజ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాణి పద్మిణితో అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రేమాయణం నడిపినట్లు ఈ సినిమాలో చూపించారని రాజా సింగ్ ఆరోపించారు. చరిత్రలో అసలు అలాంటిది జ‌రుగ‌లేదని, నిజానికి ఖిల్జీ చిత్తోర్‌గఢ్‌పై దాడి చేశాడని రాజాసింగ్ వివ‌రించారు. ఖిల్జీ దాడితో 16 వేల మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారని కూడా బీజేపీ ఎమ్మెల్యే వివ‌రించారు. ప‌ద్మావ‌తి సినిమాను యువ‌త‌ బాయ్‌ కాట్ చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. హిందు ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు సినిమాను బాయ్‌కాట్ చేయడమే కాదు.. అసలు రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సినిమా ప్రదర్శించకుండా అడ్డుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తే.. వాళ్లందరినీ బయటకు తీసుకొచ్చే పూచీ తనదని కూడా ఈ సందర్భంగా రాజా సింగ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

కాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే - షాహిద్ కపూర్ - రణ్‌ వీర్‌ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పద్మావతి. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ రావ‌ల్ ర‌త‌న్ సింగ్ అనే పాత్ర‌ని పోషించ‌గా, ర‌ణ‌వీర్ సింగ్ అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్ర‌లో మ‌రియు దీపిక ప‌దుకొణే చిత్తూరు యువ‌రాణి, రాణి ప‌ద్మావ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. డిసెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ అక్టోబ‌ర్ 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ అయిన 24 గంట‌ల‌లోనే యూట్యూబ్ రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాసిన ప‌ద్మావ‌తి చిత్ర ట్రైల‌ర్ ఇప్పుడు 50 మిలియ‌న్ క్ల‌బ్ లోకి ఎంట‌రైంది. ఈ ఆనందాన్ని షేర్ చేసుకునేందుకు బాలీవుడ్ ప్ర‌ముఖులకు శనివారం సాయంత్రం దీపిక అదిరిపోయే పార్టీ ఇచ్చింది.
Tags:    

Similar News