ఆరుసార్లు ట్రై చేసినా జగన్ అపాయింట్ మెంట్ దొరకలేదట

Update: 2019-11-15 06:39 GMT
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో విపక్ష నేతల మనసుల్ని దోచుకునేలా నిర్ణయాలు తీసుకోవటం ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సామే. కానీ.. అలాంటి క్లిష్టమైన పనిని సక్సెస్ ఫుల్  చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషులో బోధించాలన్నది చక్కటి నిర్ణయంగా చెబుతున్న ఆయన మాటలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇదే అంశం మీద జగన్ సర్కారు తీరును తప్పు పడుతున్నారు. తనకు నచ్చిన విషయం మీద పార్టీ తీరుకు భిన్నంగా రియాక్ట్ కావటం విష్ణుకుమార్ రాజు ప్రత్యేకత అన్న విషయం తెలిసిందే. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధించాలన్న నిర్ణయం ఎందుకు తప్పో తనకు తెలీదంటున్న విష్ణు.. తాను మాత్రం స్వాగతిస్తానని చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆయన తనకు అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదన్నారు. ఆరుసార్లు తాను అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తే.. స్పందన లేదన్నారు. ఇంగ్లీషు మీడియం ద్వారా మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారంటూ కన్నా చేసిన వ్యాఖ్య తనకు అర్థం కాలేదన్నారు. జగన్ నిర్ణయాన్ని స్వాగిస్తున్న విష్ణుకుమార్ రాజుకు జగన్ అపాయింట్ మెంట్ ఎందుకు ఇవ్వనట్లు? ఇంతకీ ఏపీ సీఎం అపాయింట్ మెంట్ కోసం విష్ణుకుమార్ ఎందుకంతగా ప్రయత్నిస్తున్నట్లు..?
Tags:    

Similar News