ఇక్కడ బీజేపీ గెలుపు అంత ఈజీకాదట..

Update: 2019-03-28 08:51 GMT
సాధారణంగా అధికారంలో ఉన్నవారిని ప్రతిపక్ష పార్టీలు ఓడిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రకృతే పగబట్టి ఓడిస్తుంది. దేశ చరిత్రలో అలాంటి సంఘటనలు ఉన్నాయి. 1999-2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబును 2002-04 మధ్య వచ్చిన తీవ్రమైన కరువే ఓడించిందని విశ్లేషణలున్నాయి. కరువు కరాళ నృత్యానికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం.. దేశవ్యాప్తంగా దుమారం రేగడం.. ఆ అసంతృప్త జ్వాలల్లో బాబు ఓడిపోవడం జరిగిపోయింది.

ఇప్పుడిదే కరువు బీజేపీని షేక్ చేస్తోంది. మహారాష్ట్రలో నెలకొన్న కరువు ధాటికి బీజేపీ ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితి తలెత్తుతోందట.. మహారాష్ట్రలో వచ్చిన కరువు కాటకాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అక్కడి బీజేపీ ప్రభుత్వంపై  తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయి.  ఈసారి ఈ కరువే బీజేపీని ముంచేస్తోందని.. అనుకూల పవనాలు లేవని అంటున్నారు. మొత్తం 48 పార్లమెంట్ స్థానాల్లో 15 స్థానాల్లో గెలవడమే ఎక్కువ అని సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి.

మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్ సభ స్థానాల పరిధిలో 27 స్థానాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో 40193 గ్రామాల్లో 24వేల గ్రామాలు కరువుతో అల్లాడుతున్నాయి. తీవ్ర కరువు కాటకాలతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రలో నాలుగేళ్లుగా బీజేపీ-శివసేన కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. అయితే స్వాభిమానీ షెట్కారీ ఉద్యమంతో ప్రతిపక్షాలు ఒక్కటై బీజేపీపై పైచేయి సాధించాయి. ప్రబుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు ఈ సంఘటన కారణమైంది.

కాగా సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ కరువు నివారణ - రైతులను ఆదుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసింది. రైతాంగం కోసం రూ.24వేల కోట్ల వ్యవసాయ రుణమాఫీని చేస్తామని.. 51లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రచారం చేస్తోంది. కరువు వివరించడంతోపాటు దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిజాయితీగా ప్రజల ముందుంచాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. కేంద్రం నుంచి 10800కోట్ల కరువు సాయం అందించారని.. కేంద్రం రైతులకు ఆరువేల రూపాయల రైతుబంధు అందిస్తోందని ప్రచారంలో చెప్పాలని సూచించారు.

ఇలా బీజేపీ ఎన్నికల ముందర ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత మాత్రం తగ్గడం లేదట.. ఈసారి మహారాష్ట్రలో బీజేపీ గెలుపు అంత ఈజీకాదని సర్వేలు, పార్టీ అంతర్గత చర్చల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News