ఈటలతో బీజేపీ చర్చలు..?

Update: 2021-05-25 07:38 GMT
టీఆర్ఎస్ లోని బలవంతులే ఇప్పుడు బీజేపీకి అవసరమవుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారికి బీజేపీ అగ్రతాంబూలం ఇస్తోంది. ఇప్పటికే విజయశాంతి, రఘునందన్ రావు,  జితేందర్ రెడ్డి సహా ఎంతో మందిని చేర్చుకొని బలపడిన బీజేపీ ఇప్పుడు సీఎం కేసీఆర్ తన కేబినెట్ నుంచి తొలగించిన బలమైన బీసీ నాయకుడు ఈటల రాజేందర్ కు గాలం వేస్తోందని ప్రచారం సాగుతోంది. ఆయనను బీజేపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం.

బీజేపీ రాష్ట్ర పెద్దలు.. కొందరు కేంద్రం నుంచి వచ్చిన నేతలు సన్నాహాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పెద్దలు ఈటలతో చర్చించారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు? కొత్త పార్టీ పెడుతారా? అన్న సందేహాలు ఉన్నాయి.

తాజాగా బీజేపీ జాతీయ నేత హైదరాబాద్ కు వచ్చి చర్చలు జరపడంతో మరోసారి ఈటల రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఈటల రాజేందర్ తో బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ చర్చలు జరిపారు. రెండు గంటల పాటు ఈటల భవిష్యత్ పై భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఫాంహౌస్ లో జరిగిన ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నట్టు తెలిసింది.

ఈటలను బీజేపీలో చేరాలని బీజేపీ నేతలు ఆహ్వానించగా.. ఈ విషయంలో ఈటల స్పష్టతనివ్వలేదని సమాచారం. దీనిపై ఈటల మౌనం దాల్చినట్టు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  

మొదటగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిచాకే రాజకీయ పార్టీ పెట్టాలా? బీజేపీలో చేరాలా? అన్న విషయంపై చర్చిస్తానని ఈటల అనుకుంటున్నట్టు సమాచారం. తనకు కలిసివచ్చే వ్యక్తులు, శక్తులతో ముందుకు సాగాలని ఈటల డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News