ఆమెకు మంత్రి పదవిట... జగన్ ప్రభావమేనా ?
ఏపీలో కొత్త ఏడాది తొలి రొజులలోనే మంత్రి వర్గంలో మార్పు చేర్పులు భారీగానే జరుగుతాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీలో కొత్త ఏడాది తొలి రొజులలోనే మంత్రి వర్గంలో మార్పు చేర్పులు భారీగానే జరుగుతాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి. మామూలుగా అయితే ఏడాది పాటు అయినా ఇదే మంత్రివర్గం కొనసాగుతుందని అంతా భావించారు. కానీ ఇపుడు అలా కాదని లెక్క వేసుకుని మరీ కొందరి పేర్లను రెడ్ లిస్ట్ లో చేర్చారు అంటున్నారు.
మంత్రులుగా బెంచ్ మార్క్ ని అందుకోలేదని భావించే వారిని పక్కన పెట్టి వారికి బదులుగా కొత్త వారిని తీసుకోవాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. మంత్రివర్గంలో మార్పు చేర్పులలో ఎవరికి చాన్స్ ఎవరికి చెక్ అన్నది కూడా ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు ఇందులో మరో ఆసక్తికరమైన మ్యాటర్ అయితే బయటకు వస్తోంది. అదేంటి అంటే ఏపీ విపక్ష నేత మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా మీద కూడా ఈ రీ షఫలింగ్ ప్రభావం పడబోతోంది అంటున్నారు.
కడప జిల్లా నుంచి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డిని చంద్రబాబు మంత్రిగా తీసుకున్నారు. ఆయనకు కీలకమైన రవాణా శాఖను అప్పగించారు. రాం ప్రసాదరెడ్డి గతంలో వైసీపీలో ఉండేవారు. ఆయనను తెచ్చి మంత్రిని చేయడం ద్వారా ఫ్యాన్ పార్టీని కడప జిల్లాలో కట్టడి చేయవచ్చునని ఊహించారు.
కానీ ఆయన ధీటుగా పని చేయలేక పోతున్నారు అన్న ప్రచారం సాగుతోందిట. అందుకే ఆయన ప్లేస్ లో బలమైన గొంతుకకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారుట. కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవీ రెడ్డికి ఈ గోల్డెన్ చాన్స్ తగలబోతోంది అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఆమె ఇప్పటికే కడప వైసీపీని ముప్పతిప్పలు పెడుతున్నారు.
కడప కార్పోరేషన్ మీటింగ్ పెట్టాలి కానీ ఆమె అక్కడ వైసీపీని గట్టిగానే నిలదీస్తూ వస్తున్నారు. కడప కార్పోరేషన్ లో ఫుల్ మెజారిటీ ఉన్న వైసీపీ నుంచి కొందరు కార్పోరేటర్లను ఆమె టీడీపీలోకి లాగేశారు. ఆమెకు ప్రభుత్వ విప్ పదవిని ఇచ్చి కేబినెట్ ర్యాంక్ హోదా కూడా కల్పించారు.
దాంతో ఆమె మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో ఆమె వైసీపీని టార్గెట్ చేయడంతో జగన్ కడప జిల్లా కార్పోరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అందరికీ భరోసా ఇవ్వడం జరిగింది అంటారు. పార్టీని వీడవద్దని ముందు అంతా మంచి కాలమేనని జగన్ చెప్పాల్సి వస్తోంది.
దాంతో ఆమెకు టీఎడీపీ అధినాయకత్వం వద్ద మంచి మార్కులే పడ్డాయని అంటున్నారు. కడప నుంచి మహిళా మంత్రిగా ఆమెకు చాన్స్ ఇస్తే వైసీపీ మీద రాజకీయ పోరాటాన్ని ఆమె వేరే లెవెల్ కి తీసుకుని పోగలరని హైకమాండ్ భావిస్తోందిట.
దాంతో ఆమెకు మంత్రివర్గం మార్పు చేర్పులలో జాక్ పాట్ తగలనుంది అని అంటున్నారు. కడప నుంచి ధీటైన నేత మంత్రిగా ఉంటే వైసీపీకి సులువుగా చెక్ చెప్పవచ్చు అన్నదే వ్యూహంగా ఉంది అని అంటున్నారు. కడపలో జగన్ ఇలాకాలో మహిళా మంత్రిని నియమిస్తే ఫ్యాన్ పార్టీకి ఆటోమేటిక్ గా బ్రేకులు పడతాయని కూడా లెక్క వేస్తున్నారు.
మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది అన్నది ముందు ముందు తెలుస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా రెండు దశాబ్దాల తరువాత కడప అసెంబ్లీ సీటు నుంచి టీడీపీ జెండా ఎగరేసిన మాధవీ రెడ్డికి టీడీపీలో అధిక ప్రాధాన్యత దక్కుతోంది. దానికి తగినట్లుగా ఆమె కూడా జిల్లాలో తన హవా చాటుకునే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు.