పోలింగ్ వేళ.. బీజేపీ గాల్లో తేలే రిజల్ట్

Update: 2017-02-11 13:29 GMT
కొన్నిసార్లు అంతే.. గాలి మహా వాటంగా వీచేస్తుంటుంది. మన ప్రయత్నం కొంత చేసినా.. ఫలితం మాత్రం ఊహించిన దాని కంటే ఎక్కువగా వచ్చేస్తుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే బీజేపీకి ఎదురైంది. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం మొండుగా ఉన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. పోటాపోటీగా ప్రచారం సాగుతున్నవేళ.. తొలివిడత పోలింగ్ జరుగుతున్న సమయంలోనే బీజేపీకి ఒక తీపికబురు వెల్లడైంది.

ఉత్తరప్రదేశ్ లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన అభ్యర్థులు ఘన విజయం సాధించటంపై కమలనాథులు సంతోషంతో ఉబ్బితబ్బుబ్బి పోతున్నారు. యూపీలోని కాన్పూర్.. గోరఖ్ పూర్.. బరేలీ జిల్లాల్లోని మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో.. తాజాగా జరుగుతున్న యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్న అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

ప్రజలు మోడీ పట్ల సానుకూలంగా ఉన్నారన్న విషయం.. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రుజువైందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఈ రోజు తొలివిడత పోలింగ్ కింద 73 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తుది ఫలితం మార్చి 11న వెల్లడికానుంది. నెల తర్వాత వచ్చే రిజల్ట్ ఈ రోజు వచ్చిన ఎమ్మెల్సీ ఫలితం ముందస్తుగా చెప్పేసిందా? లేదా? అన్నది తేలాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News