మోడీజీ పంచాయ‌తీ స‌భ్యుడి భాష వాడేశావేంటి?

Update: 2018-08-12 05:07 GMT
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనంతరం తన ప్రసంగంలో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ ఉపయోగించిన భాషపై నెల‌కొన్న వివాదం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. ఈ ఎన్నిక సందర్భంగా ప్రధాని మోడీ విపక్ష అభ్యర్థి బీకే హరిప్రసాద్‌ పై చేసిన వ్యాఖ్యలపై కలకలం నెలకొంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్  ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్‌ సింగ్ గెలుపొందిన అనంతరం ఆయన్ను అభినందించిన మోడీ రాజ్యసభలో గురువారం కొద్దిసేపు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు హరిలు పోటీపడ్డారని వ్యాఖ్యానిస్తూ బీకే హరిప్రసాద్‌ ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ ను సైతం దుమ్మెత్తిపోశారు. దీంతో విపక్ష అభ్యర్థి హరిప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. సభ హుందాతనాన్ని ప్రధాని దిగజార్చారని, ఆయన వ్యాఖ్యలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానిస్థాయి లాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం తగదని అన్నారు. ఈ పదాల్ని రికార్డుల నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో రికార్డుల నుంచి వాటిని తొలిగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రకటించారు.

అయితే, విపక్షాల తరఫున పోటీచేసిన అభ్యర్థి బీకే హరిప్రసాద్ మరోసారి మండిపడ్డారు. ప్రధాని మోడీ ఉపయోగించిన భాష పంచాయతీ సభ్యుడు కూడా సిగ్గుతో తలదించుకునేలా ఉందని ధ్వజమెత్తారు.  కాగా ప్రధాని తనను అవమానించడంపై బీకే హరిప్రసాద్ ట్విట్టర్‌ లో స్పందించారు. ``ఈ దేశ ప్రధాన మంత్రిని పీఎం అని పిలుస్తారు. పంచాయతీ మెంబర్‌ ను కూడా పీఎం అనే పిలుస్తారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యక్తిగతంగా నాపై ఉపయోగించిన భాష పట్ల పంచాయతీ సభ్యుడు కూడా సిగ్గుపడుతాడు`` అని హరిప్రసాద్ ట్వీట్ చేశారు. కర్ణాటకకు చెందిన హరిప్రసాద్ వ్యాఖ్యలను రీట్వీట్ చేసిన ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి - కాంగ్రెస్ నేత జీ పరమేశ్వర స్పందిస్తూ ప్రధాని మోదీ కేవలం హరిప్రసాద్‌ ను మాత్రమే అవమానించలేదు. మొత్తం కర్ణాటక ప్రజలకు ఇది అవమానకరం. ప్రధాని పదాలను ఎంపిక చేసుకునేటప్పుడు మరింత వివేకం ప్రదర్శించాలి అని పేర్కొన్నారు.
Tags:    

Similar News