ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అన్మ‌ద‌మ్ముల స‌వాలేనా?

Update: 2022-09-01 09:28 GMT
వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అప్పుడే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల కాక మొద‌లైపోయింది. పోటీ చేసే అభ్య‌ర్థులు, వారి బ‌లాబలాల మీద ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఓవైపు అధికారం చేజిక్కించుకోవ‌డ‌మే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ న‌వోత్సాహంతో ముందుకు క‌దులుతోంది. మ‌రోవైపు టీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారం సాధించి హ్యాట్రిక్ న‌మోదు చేయాల‌ని చూస్తోంది. బీజేపీ కూడా త‌న ఉనికిని చాటుకోవాల‌నుకుంటోంది.

ఈ నేప‌థ్యంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయా పార్టీల త‌ర‌ఫున ఒకే కుటుంబంలోని వ్య‌క్తులు పోటీ చేయనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో నిజామాబాద్ అర్బ‌న్ నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ త‌న‌యుడు సంజ‌య్, బీజేపీ త‌ర‌ఫున ప్ర‌స్తుత నిజామాబాద్ ఎంపీ, డి.శ్రీనివాస్ మ‌రో కుమారుడు అర‌వింద్ పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మేనంటున్నారు.

కాగా ప్ర‌స్తుతం నిజామాబాద్ అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా బిగాల గ‌ణేష్ గుప్తా ఉన్నారు. 2014, 2018ల్లో టీఆర్ఎస్ త‌ర‌ఫున ఆయ‌న విజ‌యం సాధించారు. బిగాల గ‌ణేష్ గుప్తా.. కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు స‌న్నిహితుడిగా పేరుంది. కాగా గ‌త రెండు ప‌ర్యాయాలు గెలిచిన ఆయ‌న‌పై నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని అంటున్నారు.

రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ నిజామాబాద్ న‌గ‌ర అభివృద్ధికి గ‌ణేశ్ గుప్తా కృషి చేయ‌లేద‌ని ప్ర‌జ‌ల్లో ఆరోప‌ణ‌లున్నాయి. అలాగే భూక‌బ్జాల విష‌యంలోనూ ఎమ్మెల్యేపై ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు కురిసి ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డ‌ప్ప‌టికీ ఎమ్మెల్యే గ‌ణేష్ జాడ లేద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వచ్చే ఎన్నిక‌ల్లో బిగాల గ‌ణేశ్ గుప్తాకు సీటు రాక‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. ఒక‌వేళ పోటీ చేసినా టీఆర్ఎస్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. నిజామాబాద్ అర్బ‌న్ నుంచి గ‌తంలో నాలుగుసార్లు పీసీసీ మాజీ అధ్య‌క్షుడు డి.శ్రీనివాస్ ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీఆర్ఎస్ లో చేర‌డం.. రాజ్య‌స‌భ సీటు ద‌క్కించుకోవ‌డం జ‌రిగిపోయాయి. ఆ త‌ర్వాత కేసీఆర్ వ‌చ్చిన విభేదాల‌తో ఆ పార్టీ నుంచి త‌ప్పుకున్నారు.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో డి.శ్రీనివాస్ త‌న‌యుడు, మాజీ మేయ‌ర్ సంజ‌య్ నిజామాబాద్ బ‌రిలో దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తార‌ని అంటున్నారు. ఇక బీజేపీ త‌ర‌పున సంజ‌య్ సోద‌రుడు, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అర‌వింద్ లేదా మాజీ ఎమ్మెల్యే యెండ‌ల లక్ష్మీనారాయ‌ణ బ‌రిలో దిగుతార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అన్నద‌మ్ములు ఇద్ద‌రూ పోటీ చేస్తే కాంగ్రెస్ అభ్య‌ర్థి సంజ‌య్ నే విజ‌యం వ‌రించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అర‌వింద్ పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News