జ‌గ‌న్‌ కు ఎందుకీ త‌ల‌నొప్పి?

Update: 2015-08-30 10:47 GMT
ఈ మధ్యే వైసీపీ కండువా కప్పుకున్న బొత్స సత్యనారాయణ విజయనగరంలో పట్టుకోసం నానా పాట్లు పడుతున్నారట. బొత్స  చేరికతో విజయనగరం జిల్లాలో పార్టీ బలపడుతుందని వైసీపీ పెద్దలు లెక్కలేసినా సీన్‌ వేరేలా ఉందంటున్నారు. ఇంటగెలిచి రచ్చగెలవాల్సిన ఆయన సొంత గడ్డపై తడబడుతున్నారు. బొత్స రాక‌తో జిల్లాలో ఒక్కటిగా ఉన్న వైసీపీ నేతలు... బొత్స చేరికతో రెండుగా చీలినట్లు తెలుస్తోంది.

వీరిలో ఒకటి కోలగట్ల వర్గం కాగా మరొకటి బొత్స వర్గం. ఈ రెండు వర్గాలు ఎవరి రాజకీయాలు వాళ్లు చేస్తున్నారట. మొదటి నుంచి వైసీపీలో తమకే జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని కోలగట్ల వర్గం ప్రచారం చేసుకుంటుంటే... వైఎస్‌ కుటుంబంతో బొత్సకున్న సాన్నిహిత్యం వేరులే అంటూ మరో వర్గం చెప్పుకుంటోంది.

వైసీపీలోకి బొత్స రాకను మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీ వీడతారనుకున్న బొబ్బిలి రాజులు, ఎమ్మెల్సీ కోలగట్ల,  పెనుమత్స సాంబశివరాజు తమ ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తోంది. పార్టీని వీడేది లేదంటున్న ఈ నేతలు.. బొత్సతో మాత్రం కలిసిపనిచేసేది లేదని తేల్చి చెబుతున్నారు. మొదట్లో కోల్డ్‌వార్‌ లా ఉన్న రాజకీయాలు... ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి.

ప్ర‌త్యేక హోదా కోసం రాష్ర్ట వ్యాప్త బంద్‌ ను పాటించేందుకు పార్టీ నేత‌ల‌ ప్ర‌క‌ట‌న‌లు, పోస్ట‌ర్ల‌లో స్ప‌ష్టంగా బొత్సను రాష్ర్ట నాయ‌కుడిగా కీర్తిస్తూ... కోల‌గ‌ట్ల‌ను జిల్లా అధ్యక్షుడిగానే పేర్కొన్నారు. దీంతో కావాల‌నే త‌మ నాయ‌కుడి స్థాయిని త‌గ్గించార‌ని కోల‌గ‌ట్ల వ‌ర్గం మండిప‌డింది. ఈ విష‌యం త్వ‌ర‌లోనే జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నాయి.

ఈ మధ్య బొత్స జన్మదినం, వైఎస్‌ జయంతి వేడుకలు అంతర్గత రాజకీయాలకు వేదికయ్యాయి. వైసీపీలో చేరిన తర్వాత మొదటిసారి జరిగే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బొత్స అనుచరులు భారీ ర్యాలీ ఏర్పాట్లు చేశారు. విజయనగరం పట్టణంతోపాటు పలు మండలాల్లో భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌ లు పెట్టి ఆడంబరంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.

అంతా బాగానే ఉన్నా ... ఫ్లెక్సీలు వివాదానికి కారణమయ్యాయని తెలుస్తోంది. ఫ్లెక్సీలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల ఫోటో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది బొత్స వర్గం. కానీ అక్కడే కోలగట్లకు చిర్రెత్తుకొచ్చిందట. ఆయన నేరుగా ఫ్లెక్సీలు ముద్రించేవారికి ఫోన్‌ చేసి ఓ రేంజ్‌ లో ఫైరయ్యారని తెలుస్తోంది.

మొత్తంగా వైసీపీ విజ‌య‌న‌గ‌రంలో కుంపట్లు మొద‌ల‌యిన‌ట్లేన‌ని రాజకీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.
Tags:    

Similar News