ఒక్క‌మాటతో... సుజ‌య్‌ వంద తిట్లు తిన్నారే!

Update: 2017-10-29 17:07 GMT
ఏపీ సీఎం చంద్ర‌బాబు టీం స‌భ్యుడు, మంత్రి సుజ‌య్ కృష్ణ‌రంగారావును విప‌క్షం వైసీపీ నేత‌లు ఓ రేంజ్‌ లో క‌డిగిపారేశారు. ఆయ‌న ఒక్క‌మాట అని వీరితో వంద తిట్లు తిన్నారు. నిజానికి 2014లో వైసీపీ నుంచి గెలిచిన సుజ‌య్ కృష్ణ‌రంగారావు చాలా సౌమ్యుడిగా పేరుపొందారు. అయితే, చంద్ర‌బాబు వేసిన ఆక‌ర్ష్ మంత్రానికి ఈయ‌న కూడా పార్టీ ఫిరాయించారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు బాబు మంత్రి గిరీ అప్ప‌గించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. బాబు ప్రోద్బ‌లంతో ఆయ‌న దృష్టిలో ప‌డేందుకు సుజ‌య్ నానా తిప్పులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీలోని కీల‌క నేత‌లు, సీనియ‌ర్ నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఉద్దేశించి ``బ్రోక‌ర్‌`` అంటూ విప‌రీత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు చిర్రెత్తుకొచ్చింది.

ఈ క్ర‌మంలోనే సుజ‌య్‌ పై వైసీపీ నేత‌లు వ‌రుస పెట్టి క‌డిగిపారేశారు. రైతుల డబ్బులు తీసుకొని.. చైన్నైకి పారిపోయిన చరిత్ర ఆయనదని పార్టీ నేత బెల్లాన చంద్రశేఖర్‌ మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్టుపై ఎంత ఖర్చు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. మంత్రి పదవి కోసం పార్టీ మారిన వ్యక్తి సుజయ్‌ అని, ఇప్పడు బ్రోకర్‌ ఎవరో ఆయనే చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టబోతున్న పాదయాత్ర టీడీపీ నేతల్లో గుబులు రేపుతోందని మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సయ్య విమర్శించారు. బొత్సను విమర్శించే అర్హత మంత్రి సుజయ్‌ కృష్ణకు లేదన్నారు.

సుజ‌య్‌లో నిజానికి అంత నిజాయితీ ఉంటే పార్టీ మారిన నేప‌థ్యంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి నిరూపించుకోవాల‌ని, తెలుగు దేశం జెండాపై గెలిచి ఆ త‌ర్వాత ఏమైనా ఉంటే కామెంట్లు విస‌రాల‌ని మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు దుయ్య‌బ‌ట్టారు. చంద్ర‌బాబు చేతిలో కీలుబొమ్మ‌గా మారి, కేవలం మంత్రి ప‌ద‌వి కోసం ఆయ‌న‌కు అమ్ముడు పోయిన రంగారావు.. వైసీపీ నేత‌ల‌ను విమ‌ర్శించే హ‌క్కులేద‌ని విమ‌ర్శించారు. ఏదైనా ఉంటే బాబుకు చెప్పుకోవాల‌ని, బాబు చేస్తున్న అవినీతి పాల‌న‌లో భాగ‌స్వాములు అయినందుకు సిగ్గు ప‌డాల‌ని, వైసీపీ జెండా, జ‌గ‌న్ అజెండాల‌ను అడ్డు పెట్టుకుని 2014లో గెలిచి.. నిస్సిగ్గుగా పార్టీ మారినందుకు సుజ‌య్ త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మొత్తానికి సుజ‌య్ ఒక్క‌మాట అని వైసీపీ నేత‌ల‌తో ఇలా వంద తిట్లు తిన‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వ‌స్తున్నాయి. మ‌రి మంత్రి వ‌ర్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News