ఈ బాక్స‌ర్‌ కు పాలిటిక్స్ బాగానే వంట‌బ‌ట్టాయే!

Update: 2019-05-10 16:39 GMT
రాజ‌కీయం అంటే అంతే మ‌రి. ఒక్క‌సారి అడుగుపెడితే... దాని నుంచి వేరు కావ‌డం అంత వీజీ ఏమీ కాదు. అలా అని ఇదేదో అంటువ్యాధేమీ కాదు. డాబూ ద‌ర్పాల‌కు కేరాఫ్ అడ్రెస్‌. మ‌రి ఇలాంటి దాని రుచి చూసిన త‌ర్వాత దానిని వ‌దిలేయ‌డం అంత వీజీ కాదు క‌దా. ఈ విష‌యం చాలా మందికి అంత త్వ‌ర‌గా బోధ‌ప‌డ‌దు గానీ.... బాక్స‌ర్‌గా ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసి భార‌త కీర్తి ప‌తాక‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో రెప‌రెప‌లాడించిన విజేంద‌ర్ సింగ్ మాత్రం ఈ విష‌యాన్ని చాలా త్వ‌ర‌గానే తెలుసుకున్నారు. తెలుసుకోవ‌డంతోనే ఆయన స‌రిపెట్టుకోలేదు. రాజ‌కీయం అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో... దానితో త‌న భ‌విష్య‌త్తు ఎంత‌గా జోడీగా సాగుతుందోన‌న్న విష‌యాన్ని ఆయ‌న కాస్తంత గ‌ట్టిగానే చెప్పేశారు.

ఇటీవ‌లే గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో చేరిన ఈ బాక్స‌ర్‌.. ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హ‌స్తం పార్టీ గుర్తుపై ద‌క్షిణ ఢిల్లీ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఫ‌క్తు పొలిటీషియ‌న్ల మాదిరే విజేంద‌ర్ కూడా ప్ర‌చారాన్ని త‌న‌దైన శైలిలో హోరెత్తిస్తున్నారు. ద‌క్షిణ ఢిల్లీలో తాను గెల‌వ‌డంతో పాటుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న‌ను వినిపిస్తూ వ‌స్తున్న విజేంద‌ర్‌... రాజ‌కీయాల‌కు వ‌దిలే ప్ర‌సక్తే లేద‌ని తేల్చేశారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిచినా, ఓడినా రాజ‌కీయాల‌ను వ‌దిలేది లేద‌ని ఆయ‌న తేల్చి పారేశారు. మ‌రి బాక్సింగ్ మాటేమిట‌న్న విష‌యాన్ని కూడా చెప్పేసిన విజేంద‌ర్‌... బాక్సింగ్ త‌న ర‌క్తంలోనే ఉంద‌ని, బాక్సింగ్‌ తో పాటు రాజ‌కీయాల‌ను స‌మాంత‌రంగా కొన‌సాగిస్తాన‌ని చెప్పుకొచ్చారు.

ఇక ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తీవ్ర పోటీనే ఎదుర్కొంటున్న విజేంద‌ర్‌... అస‌లు ఆప్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిదైంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆప్ ప‌ట్ల ఢిల్లీ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఆప్ కు త‌గిన రీతిలో బుద్ధి చెబుతార‌ని కూడా విజేంద‌ర్ తెలిపారు. మొత్తంగా క్రీడ‌ల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న విజేంద‌ర్‌... రాజ‌కీయాల్లోకి వ‌చ్చీ రాగానే ఇలా పాలిటిక్స్ ను వ‌దిలేది లేదంటూ వ్యాఖ్య‌లు చేసి అందరినీ ఆక‌ట్టుకున్నార‌నే చెప్పాలి.

Tags:    

Similar News