దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సిందేనని....ఇందుకోసం కాంగ్రెస్ - బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కావాలని ప్రకటించడమే కాకుండా...ఆ ఫ్రంట్ కు తానే శ్రీకారం చుడతానని వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో సంచలనానికి వేదికగా మారిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేసీఆర్ ప్రకటన హాట్ టాపిక్ అయినట్లు ఢిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రధాని మోడీని టార్గెట్ గా చేసిన కేసీఆర్ ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మరోవైపు కేసీఆర్ ప్రధాని కావాలని ఆయన అనుకూల వర్గాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా యాగం చేయడం గమనార్హం.
ఇప్పటికే గులాబీ దళపతి కేసీఆర్ ప్రధాని కావాలని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రధాని అయితే దేశానికి మేలు జరుగుతుందని, తన అభివృద్ధి పంథాలో కొత్త మార్పులు తీసుకువస్తారని వారు ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరు అయితే కేసీఆర్ ప్రధాని పీఠం ఎక్కి ప్రమాణ స్వీకారం కూడా చేసేసినట్లు ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ ప్రధాని కావాలని యాగం చేశారు!
తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘం పేరుతో ఆయా సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపై హైదరాబాద్ లో యాగం చేశారు. బషీర్ భాగ్ లోని కనకదుర్గ ఆలయంలో ఈ మేరకు ప్రత్యేక యాగం చేసినట్లు సంఘం ప్రతినిధులు వివరించారు. బ్రాహ్మణ సంక్షేమం కోస కేసీఆర్ ఎంత చేశారని కొనియాడారు.