మూడు రాజ‌ధానుల‌కు బ్రేక్: కొత్త రీజ‌న్ ఇదేనా?

Update: 2021-04-06 17:30 GMT
వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మాన‌స‌పుత్రిక‌గా భావిస్తున్న కీల‌క నిర్ణ‌యం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయ‌డం. అమ‌రావ‌తి రాజ‌ధాని కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గానికి, ఒక వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని. దీనివ‌ల్ల రాష్ట్రం మొత్తానికి ఒనగూరే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు. అంతేకాదు.. ముందుముందు.. ప్రాంతాల వారీగా ఉద్య‌మాలు త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని కూడా జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ విష‌యం ఇప్ప‌టికే.. అసెంబ్లీలో స్ప‌ష్టం చేయ‌డం.. అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని కూడా ప‌క్క‌న పెట్టి.. మూడు రాజ‌ధానుల‌కు ముందుకు దూక‌డం తెలిసిందే. కేంద్రం కూడా మూడు రాజ‌ధానులైనా.. ముప్పై రాజ‌ధానులైనా త‌మ‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు న్యాయ‌ప‌రంగా.. ఈ విష‌యంలో అనేక చిక్కులు వ‌చ్చాయి. అమ‌రావ‌తి రైతులు.. ఇప్ప‌టికే.. కోర్టుకు వెళ్లారు. త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని వాదిస్తున్నారు. ఇక‌, ప్ర‌జాసంఘాల నాయ‌కులు కూడా ఇప్ప‌టికే కోర్టులో పిటిష‌న్లు వేశారు. దీనికితోడు హైకోర్టు ఆదేశాల మేర‌కు అన్ని పార్టీలు కూడా .. ఈ రాజ‌ధానుల అంశంపై.. హైకోర్టులో అఫిడ‌విట్లు దాఖ‌లు చేశాయి. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది. ఇప్ప‌టికే వాటిపై విచార‌ణ పూర్త‌యింది. అయితే.. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మార్పుతో తిరిగి అవ‌న్నీ .. విచార‌ణ‌కు వ‌స్తున్నాయి. దీనివ‌ల్ల జ‌గ‌న్ పెట్టుకున్న మూడు రాజ‌ధానుల టార్గెట్ ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తికాలేదు. అయితే.. మే 6న ఎట్టి ప‌రిస్థితిలోనూ విశాఖ‌కు వెళ్లిపోవాల‌ని .. జ‌గ‌న్ భావిస్తున్నారు. ఏదో ఒక రూపంలో అక్క‌డ పాగా వేయాల‌ని అనుకుంటున్నారు.

అయితే.. ఇప్పుడు మూడు రాజ‌ధానుల విష‌యంలో న్యాయ రాజ‌ధానిని త‌ర‌లించేందుకు రాష్ట్ర‌ప‌తి నోటిఫై చేయాల్సిన అవ‌స‌రం ఉంది. అంటే.. దీనికి సంబంధించి ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో హైకోర్టును ఏర్పాటు చేశారు. దీనిని ఇప్పుడు క‌ర్నూలుకు త‌ర‌లించాలి. అంటే.. దీనికి మ‌ళ్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించి.. అక్క‌డ ఆమోదం పొంది.. మ‌ళ్లీ రాష్ట్ర‌ప‌తి నోటిఫై చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇది.. ఈ ఏడాది అయ్యే ప‌రిస్థితి లేద‌ని.. తాజాగా కేంద్రం నుంచి స‌మాచారం వ‌చ్చింది. అదే స‌మ‌యంలో విశాఖ‌కు పాల‌నా రాజ‌ధానిని త‌ర‌లించేందుకు కూడా విశాఖ ఉక్కుఉద్య‌మం అడ్డుగా వ‌స్తోంది.

ఇప్ప‌టికే కార్మిక సంఘాలు అక్క‌డ రాజ‌ధానిని ఏర్పాటు చేసేందుకు ముందుగానే త‌మ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని.. ప‌ట్టుబ‌డుతున్నాయి. అంటే.. ఉక్కును ప్రైవేటీ క‌రించ‌కుండా.. కేంద్రం నుంచి స‌రైన హామీనైనా పొందాలి. లేదంటే.. ఉక్కును ప్రైవేటీక‌రించ‌కుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లైనా తీసుకోవాలి. లేక‌పోతే.. అక్క‌డ స్థానికంగా కార్మికులు, ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు ఇప్ప‌ట్లో సాధ్యం అయ్యేలా క‌నిపించ‌డం లేద‌ని వైసీపీ వ‌ర్గాలే పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి.





Tags:    

Similar News