అగ్నిపథ్ నిరసనల వేళ.. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్రం

Update: 2022-06-18 10:30 GMT
చక్కగా సాగేదానిని సాగనివ్వకుండా ఏదో చేద్దామని ప్రయత్నించే వేళ.. మరేదో అయి.. కంపు కంపుగా మారే పరిస్థితులు అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే అగ్నిపథ్ విషయంలో మోడీ సర్కారుకు ఎదురైంది.

అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో కొత్తగా ప్రవేశ పెట్టిన తాత్కాలిక నియామక విధానంపై పెద్దఎత్తున నిరసనలు చోటు చేసుకోవటంతో పాటు.. భారీ హింసాత్మక చర్యలు.. రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసిన వైనం తెలిసిందే.

సైనిక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు మోడీ సర్కారు నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ. .హింసాత్మక చర్రయలకు పాల్పడటం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది.

బీహార్.. ఉత్తర ప్రదేశ్.. హర్యానా తో పాటు తెలంగాణలోనూ నిరసనలు.. హింసాత్మక చర్యలు చేపట్టటం తెలిసిందే. ఆందోళనలు అదుపు తప్పి పోతున్న నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు రియాక్టు అయ్యింది. పలు కీలక నిర్ణయాల్ని వెల్లడించారు.

అగ్నిపథ్ పథకంలో భాగంగా నాలుగేళ్ల తర్వాత రిటైర్ కావాల్సిన ఉద్యోగుల అంశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని మార్పుల్ని తాజాగా (శనివారం ఉదయం) ప్రకటించారు. అందులో ముఖ్యమైనది రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు.. అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాదు.. రెండు బలగాల్లో చేరటానికి అవసరమైన గరిష్ఠ వయోపరిమితిలో మూడేళ్లు సడలింపు ఇవ్వనున్నట్లుగా కేంద్ర హోం శాఖ కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో.. తాజా అగ్నిపథ్ పథకంలో భాగంగా మొదటి బ్యాచ్ కు ఐదేళ్ల వరకు వయో సడలింపు లభిస్తుందని చెబుతున్నారు. మరి.. కేంద్రం చేసిన తాజా మార్పులపై ఆర్మీలో చేరాలనుకునే వారు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News