సంచలన నిర్ణయం: ఐరోపా నుంచి బ్రిటన్ ఎగ్జిట్..

Update: 2020-01-10 08:04 GMT
యురోపియన్ యూనియన్.. ఐరాపాలోని మొత్తం సంపన్న దేశాలతో ఏర్పడ్డ ఈ యూనియన్లో బ్రిటన్ పెద్దన్నగా ఉంటూ వస్తోంది. అయితే అన్నింటికి ముందట పడి భారీగా డబ్బు వెచ్చించి బ్రిటన్ ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోయిందన్న వాదన ఆ దేశ ప్రజల్లో ఉంది. అందుకే ఈ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ లో డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. మన డబ్బు, హక్కులు మనకేనని నినదిస్తున్నారు.

తాజాగా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఏళ్లుగా ‘బ్రెగ్జిట్’పై నెలకొన్న సందిగ్ధానికి స్వస్తి పలికింది. బ్రిటన్ పార్లమెంట్ లో జరిగిన ఓటింగ్ లో ‘బ్రిగ్జెట్’కు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఈ బిల్లుకు మద్దతు తెలుపగా.. ప్రతిపక్ష లేబర్ పార్టీ వ్యతిరేకించింది.

దీంతో ఈనెల 31న యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి అధికారికంగా వైదొలగడానికి బ్రిటన్ తీర్మానం చేసింది. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోతున్న మొదటి దేశం బ్రిటన్ కావడం గమనార్హం.

ఐరోపా సమాఖ్యలో ఉండడం వల్ల బ్రిటన్ నష్టపోతుందని మిగతా దేశాలు అంటుంటే.. తమ డబ్బు, సామర్థ్యం తమకే దక్కి లాభపడుతామని బ్రిటన్ వాసులు అంటున్నారు. గత వైభవం తిరిగి వస్తుందని.. అనవసరంగా ఈయూకు ఖర్చు చేయడం వల్లే బ్రిటన్ దెబ్బతిందని అంటున్నారు. ప్రధాని జాన్సన్ బ్రిగ్జిట్ చేస్తానన్న హామీతోనే ఎన్నికలకు వెళ్లి భారీ మెజార్టీ సాధించారు. ఇప్పుడు దాన్ని నెరవేర్చారు.
Tags:    

Similar News