వివేకా హత్య కేసులో షర్మిల వాగ్మూలం కీలకం...?

Update: 2022-10-12 17:30 GMT
ఏపీలో అతి ముఖ్యమైన కేసుగా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించేదిగా వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఉంది. జగన్ సీఎం కాక ముందు ఆ మాటకు వస్తే ఏపీలో ఎన్నికల నగరా మోగిన తొలి రెండు మూడు రోజుల్లోనే వివేకా దారుణ హత్య జరిగింది. ఇపుడు చూస్తే జగన్ సీఎం అయి మూడున్నరేళ్ళు అవుతోంది కానీ ఈ కేసు ఒక కొలిక్కి రావడం లేదు. అయితే సుప్రీం కోర్టు ఈ మధ్యన వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్ గా మారడం మీద నిందితులు అయిన దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి దాఖలు చేసిన సవాల్ పిటిషన్ ని కొట్టేసింది. దాంతో ఈ కేసులో సీబీఐ జోరు అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

వీటి మీద తాజాగా  పులివెందుల టీడీపీ నేత ఎమ్మెల్సీ  బీటెక్ రవి సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో తొందరలోనే  సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది ఇక తప్పించుకోవడం అసాధ్యమని చెప్పారు. అంతే కాదు ఆయన మరో సంచలనమైన విషయం చెప్పారు.

ఈ కేసులో వైఎస్ జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల వివేకా కుమార్తె సునీతకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చారని సమాచారం తనకు  ఉందని  చెప్పడం ఇపుడు రచ్చకు కారణం అవుతోంది. అసలు షర్మిలను ఎపుడు సీబీఐ అధికారులు కలిశారు. ఆమె వాంగ్మూలం ఎపుడు తీసుకున్నారు ఆమె ఈ కేసులో సునీత పక్షాన నిలబడి ఎలా కీలక వివరాలు చెప్పారు అన్నది ఆసక్తిని కలిగిస్తోంది.  ఈ విషయాలు అన్నీ కూడా బీటెక్ రవికి ఎలా తెలుసు అన్న చర్చ కూడా నడుస్తోంది.

మరో వైపు చూస్తే దస్తగిరి ఈ కేసులో నిందితుడిగా ఉండి తరువాత అప్రూవర్ గా మారిపోయి చాలా మంది పేర్లు చెప్పారు. అలా లిస్ట్ ఇపుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దాకా వచ్చి ఆగింది. అది కాస్తా పైకి ఎగబాకితే అవినాష్ మెడకు చుట్టుకుంటుంది అని బీటెక్ రవి చెబుతున్నారు.

ఇక దస్తగిరి చెప్పిన విషయాలనే ఆ పేర్లనే దాదాపుగా షర్మిల కూడా ఈ కేసులో తన వాగ్మూలంగా చెప్పారని అంటున్నారు. దాంతో ఇంత బలమైన ఆధారాలు అంటూ ఉన్నాక కచ్చితంగా ఈ కేసులో అవినాష్ అరెస్ట్ అవక తప్పదని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దస్తగిరి తన ప్రాణాలకు ముప్పు ఉందని అంటున్నారు. తనకు ఏమైనా జరిగితే ఏపీ సీఎం జగన్ దే బాధ్యత అని కూడా ఆయన అంటున్నారు. దాంతో ఈ కేసులో జగన్ ప్రమేయం కూడా ఉండి తీరుతుంది అని బీటెక్ రవి అంటున్నారు.

మరో వైపు ఈ కేసులో అలుపెరగని పోరాటం చేస్తున్న వివేకా కూతురు సునీత కేసుని ఏపీ పరిధి నుంచి తప్పించి తెలంగాణాకు బదిలీ చేయమని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాని మీద సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంటున్నారు. ఏది ఏమైనా ఈ నెలాఖరులో ఈ కేసుకు సంబంధించి సంచలన పరిణామాలే చోటు చేసుకుంటాయని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే అన్న జగన్ కి యాంటీగా చెల్లెళ్ళు ఇద్దరూ ఒక్కటి అయ్యారని అంటున్నారు.  జగన‌న్న విడిచిన బాణాన్ని అని చెప్పి అప్పట్లో ఏపీలో వైసీపీకి విపరీతమైన  ప్రచారం చేసిన షర్మిల ఇపుడు అదే అన్న మీదకు బాణంగా దూసుకువస్తుందా అన్నదే చర్చ మరి. ఏది ఏమైనా కూడా అవినాష్ అరెస్ట్ తప్పదని బీటెక్ రవి బల్లగుద్ది చెప్పడమే ఇపుడు చర్చగా సాగుతోంది.


Tags:    

Similar News