ఏపీ ఉద్యోగాల డేటా ప‌చ్చి అబ‌ద్ధం !

Update: 2017-07-14 14:16 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం - తెలుగుదేశం పార్టీ ప్ర‌చారంలో ఆరితేరిపోయింద‌ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. బెదిరింపులు, ప్ర‌చారం ద్వారా ఏమైనా చేయ‌గ‌ల‌మ‌నే భావ‌న‌లో టీడీపీ నేత‌లు ఉన్నార‌ని అన్నారు.  బాబు వస్తే జాబు వస్తుందని ఓట్లు వేయించుకున్న టీడీపీ ఎలాంటి ఉద్యోగాలు క‌ల్పించ‌క‌పోగా... ప్ర‌చారం మాత్రం చేసుకుంటోంద‌ని అన్నారు. ఎంవోయూల పేరుతో ప్రచార అర్భాటం చేస్తూ 2లక్షల 40వేల 452 ఉద్యోగాలంటూ  ప్రజలను మభ్యపెడుతున్నారని బుగ్గ‌న అన్నారు. సాక్షాత్తు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన డేటా మేరకు దేశమంతా 2016లో లక్ష ఉద్యోగాలొస్తే ఏపీలో 2 లక్షలకుపైగా  ఉద్యోగాలని చెబుతున్నారంటే తెలుగుదేశం నేత‌ల ప్ర‌చారం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవ‌చ్చున‌ని బుగ్గ‌న ఎద్దేవా చేశారు.

బాబు ఇచ్చిన జాబు లెక్క‌లు జంప్ జిలానీ ఖాతాకు చెందిన‌వా అని బుగ్గ‌న ప్ర‌శ్నించారు. పార్టీ మారిన ఆదినారాయ‌ణ‌ రెడ్డి - అమ‌ర్‌ నాథ్ రెడ్డి - జలీల్ ఖాన్ లాంటి వాళ్లకు ఉద్యోగాలొచ్చాయి తప్ప ఎవరికీ ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగాలిచ్చిన పాపాన పోలేదని అన్నారు. అందులోనూ నంద్యాల ఎన్నిక ఉందని జలీల్ ఖాన్ కు  వక్ఫ్ బోర్డు చైర్మ‌న్ గిరీ ఇచ్చారు త‌ప్ప ఆయ‌న‌పై ప్రేమ‌తో కాద‌ని అన్నారు. ప‌రిపాల‌న వ‌దిలేసి ఎన్నిక‌లపై టీడీపీ నేత‌లు తెగ ప్రేమ‌ చూపుతున్నారని బుగ్గ‌న అన్నారు. ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందే నంద్యాలలో మకాం వేసి విచ్చలవిడిగా మోసపూరిత వాగ్ధానాలు, ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు క్యాబినెట్ అంతా అమరావతిని వదిలేసి నంద్యాలలో తిష్టవేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని  మండిపడ్డారు. చంద్రబాబు ఆయన టీం నంద్యాలలో చెప్పేదంతా ఫాల్స్ డేటా, పచ్చి అబద్ధమని ప్రజలు కనుక్కున్నారని బుగ్గ‌న‌ చెప్పారు. గతంలో కర్నూలులో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నప్పుడు కూడ ఇలాగే చేశారన్నారు. నంద్యాలలో ప్రతి ప్రాంతానికి వెళ్లి కులాలపరంగా మేం కొంటామనే విధానంతో టీడీపీ నేతలు మాట్లాడుతుంటే నంద్యాల ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని బుగ్గన చెప్పారు. ప్రలోభాలకు లొంగకుంటే భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్  సుబ్బరాయుడు ఇంటిమీదికి అర్థరాత్రి 50మంది పోలీసులు పోయి వేధించి...భూమి అమ్ముకున్న 2 లక్షల డబ్బులను ఎత్తుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇలాగే అందరినీ బెదిరించి చేసినట్టయితే ఊర్లోకి రాని పరిస్థితి ఏర్పడుతుందన్న సంగతి తెలుసుకోవాలని బుగ్గ‌న‌ హితవు పలికారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ప‌రిపాల‌న తీరును శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అందరూ గమనిస్తున్నారని,  జగనన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తాడని ఎదురుచూస్తున్నారని బుగ్గ‌న తెలిపారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా కలుపుకొని పోతాడన్న ఆశతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుటున్నారని చెప్పారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్ట్ లకు సంబంధించిన మిగిలిపోయిన కొద్దిపాటి పనులు ప్రస్తుతం పూర్తి కాక నత్తనడకన సాగుతున్నాయన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ ను మూడొంతుల వరకు వైఎస్ఆర్ పూర్తి చేశారని, కానీ, బాబు వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేయకపోగా....ఆ ప్రాజెక్ట్ మేమే కట్టామని చెప్పుకోవడం దారుణమన్నారు.
Tags:    

Similar News