సంక్రాంతి తర్వాత.. కేబినెట్ ప్రక్షాళన.. బాబు అంతరంగం.. !
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారు.
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇద్దరు మంత్రులను తప్పించి.. వారి స్థానంలో మరో ఇద్దరితో పాటు.. జనసేన నాయకుడు నాగబాబుకు కూడా.. ఈ దఫా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. దీనికి సంబంధించి అత్యంత సన్నిహత నాయకుల తో ఆయన చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి సంక్రాంతి తర్వాత ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం.
సంక్రాంతి వరకు వేచి చూడడానికి కారణం.. మంచి ముహూర్తాలు లేకపోవడంతో పాటు.. నాగబాబు కూడా.. సంక్రాంతి తర్వాతే.. మంత్రివర్గంలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఇద్దరిని గట్టిగా మార్చేందుకు చంద్రబాబు నెల రోజుల కిందటే నిర్ణయించుకున్నారు. పనితీరు ఆధారంగానే కాకుండా.. వారి స్వభావం, ఇతరత్రా ఆరోపణలు వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలకనున్నారు.,
అయితే.. ఈ ఇద్దరు మంత్రులు ఎవరు? అనేది చెప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు సామాజిక వర్గాల మేరకు కాకుండా.. పనితీరు, దూకుడు, తన విజన్‌కు తగినట్టు నడుచుకునే వారు ఫలితాల ఆధారంగా పనిచేసే వారు.. కావాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ప్రస్తుతం ఉన్న వారిలో సగం మంది మాత్రమే చంద్రబాబు మనసు దోచుకుంటున్నారు. మిగిలిన వారిలో సగం మంది వెనుకబడి ఉన్నారు.
మరికొందరు.. నలుగురు నుంచి ఐదుగురు వరకు.. బాగా వెనుకబడ్డారు. దీంతో వీరిలోనూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు.. పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి పెరిగిన వారిని పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, జనసేన నుంచి నాగబాబుకు అవకాశం ఇస్తారు. ఆయనను ముందుగానే మంత్రివర్గంలోకి తీసుకుని.. ఆరు మాసాల్లో ఎమ్మెల్సీని చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎలా చూసుకున్నా.. సంక్రాంతి తర్వాత.. కేబినెట్‌లో ప్రక్షాళన ఖాయమన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.