పాచిపోయిన డిమాండ్‌ తో ఏం సాధిస్తారో?

Update: 2015-10-28 22:30 GMT
ప్రాక్టికల్‌గా ఆచరణ సాధ్యం అయ్యే విధంగా ఏమైనా డిమాండ్లు వచ్చినప్పుడు.. వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోతే.. వాటి గురించి పాలకపక్షాలను నిందించవచ్చు.. ప్రశ్నించవచ్చు. పోరాడవచ్చు కూడా! అది సబబుగానే ఉంటుంది. తర్కానికి అందని డిమాండ్లతో ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం ఒక్కటే లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఎవ్వరూ చేయగలిగేది ఏమీ ఉండదు. అదే సమయంలో.. అసలు కాలదోషం పట్టిపోయిన.. బూజుపట్టిన, పాచిపోయిన పాత డిమాండ్లను ఇప్పుడు కొత్తగా తెరమీదకు తీసుకువచ్చి... దానికోసం నేను పోరాటం సాగిస్తా అంటే గనుక.. అలాంటి నాయకులకు కనీసం ప్రజల మద్దతు కూడా దక్కదు. వారి పోరాటానికి ప్రభుత్వాలు విలువ ఇవ్వడం సంగతి తరువాత, కనీసం వారికి మద్దతుగా పక్కన నడిచే వారు కూడా ఉండరు. ఇన్నాళ్లపాటూ ప్రత్యేక రాయలసీమ కావాల్సిందేనంటూ ఉద్యమస్వరం వినిపించి సైలెంట్‌ అయిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యవహారం కూడా ఇంచుమించు అలాగే కనిపిస్తోంది.

బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఒకప్పుడు.. ఉద్యమ నాయకుడు లాగానే కనిపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం జరుగుతున్నప్పుడు.. వారికి రాష్ట్రం ఇచ్చేట్లయతే అదే సమయంలో ప్రత్యేక రాయలసీమ కూడా ఇవ్వాల్సిందేనని బలంగా గళం వినిపించిన నేత ఆయన. అయితే ఆతరవాత పోలీసు కేసుల్లో చిక్కుకోవడం.. ఈ నేపథ్యంలో ఆయన వాయిస్‌కు విలువ తగ్గింది. కొంతకాలం గ్యాప్‌ తర్వాత బాహ్యప్రపంచంలోకి వచ్చినా.. రాయలసీమ హక్కుల కోసం మాత్రమే పోరాడే నాయకుడిగా మారిపోయారు.

అలాంటి బైరెడ్డి ఇప్పుడు కొత్తగా తెరమీదికి వస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శంకుస్థాపన కూడా పూర్తయిపోయి.. వందల కోట్లను దాని మీద వ్యయం చేసేయడం ప్రారంభం అయిపోయిన తర్వాత.. ఆయన చెదలు పట్టిన పురాతన డిమాండ్లను ఒప్పందాలను ఇప్పుడు శిథిలాల్లోంచి బయటకు తీస్తున్నారు. మద్రాసు రాష్ట్రంనుంచి ఆంధ్రరాష్ట్రం కొత్తగా ఏర్పడిన నాటి శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం.. రాయలసీమకు రాజధాని ఉండాలని.. ఆ ఒప్పందం ప్రకారం.. సీమలోనే నిర్మించాలని అడుగుతున్నారు. అక్కడ వ్యవహారం అంతా సగం వరకు వచ్చేసిన తరుణంలో ఎన్నడో కాలదోషం పట్టిపోయిన శ్రీబాగ్‌ ఒప్పందాన్ని పట్టుకుని సీమలో రాజధాని అంటూ మాట్లాడుతూ ఉంటే.. కనీసం ఆయన వెంట నిలబడి పోరాడే మనుషులైనా దొరుకుతారా అనేది సందేహమే!
Tags:    

Similar News