బాబు పాలిచ్చే ఆవు కాదట..తన్నే దున్నపోతు అంట!

Update: 2019-08-08 14:18 GMT
ఎన్నికలు ముగిసినా... ఏపీలో అధికార వైసీపీ - విపక్ష టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం కుర్చీలో కూర్చున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... పాలిచ్చే ఆవు లాంటి తనను కాదని ప్రజలు తన్నే దున్నపోతు కావాలని కోరుకున్నారని నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనమే రేపాయి. అయితే ఓ రోజు తిరక్కుండానే జగన్ పై బాబు కామెంట్లకు కౌంటర్లు కూడా వచ్చేశాయి. బాబు పాలిచ్చే ఆవు ఎంతమాత్రం కాదని - ఆయన ముమ్మాటికీ తన్నే దున్నపోతేనని వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ఘాటు కౌంటరిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాతే జనం చంద్రబాబును చిత్తుగా ఓడించారని కూడా సీఆర్ తనదైన శైలి కామెంట్లు చేశారు.

ఇలీవల ముగిసిన ఎన్నికల్లో దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీ పట్టుమని పదేళ్ల ప్రస్థానం కూడా లేని వైసీపీ చేతిలో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. 175 సీట్లకు ఎన్నికలు జరిగితే... వైసీపీ 151 సీట్లను గెలుచుకోగా - కేవలం 23 సీట్లకు టీడీపీ పరిమితమైంది. ఈ తరహా ఘోర పరాభవం తనకు ఎందుకు దక్కిందన్న విషయం అర్థం కావడం లేదని పదే పదే చెబుతున్న చంద్రబాబు... నిన్న కూడా ఇదే మాటను వల్లె వేస్తూ జగన్ వ్యవహార సరళిని ప్రస్తావించారు. ఈ సందర్భంగానే తనను పాలిచ్చే ఆవుగా పోల్చుకున్న చంద్రబాబు... జగన్ ను మాత్రం తన్నే దున్నపోతుగా అభివర్ణించారు. పాలిచ్చే ఆవును వద్దనుకున్న జనం తన్నే దున్నపోతును ఎంచుకున్నారని చంద్రబాబు ఘాటు కామెంట్లు చేశారు.

ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చేందుకు ఎంట్రీ ఇచ్చిన సీఆర్... పాలిచ్చే ఆవు అని భావించి 2014లో ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారనీ.. అయితే పాలిచ్చే ఆవు కాదని - తన్నే దున్నపోతేనని తేల్చేసుకుని తాజా ఎన్నికల్లో ఆయనను ఓడించారని సెటైరిక్ కామెంట్లు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటమికి ప్రజల్నే బాధ్యుల్ని చేసిన ఏకైక నేత చంద్రబాబే అన్నారు సీఆర్ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. పదేపదే ప్రజల విజ్ఞతను ప్రశ్నిస్తున్న చంద్రబాబు ప్రజా తీర్పును కించపరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి భవిష్యత్తు లేదనే నిర్థారణకు వచ్చి అనేక మంది నేతలు ఆ పార్టీని విడిచి వేరే పార్టీల్లోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు గత ఐదేళ్ల పాలన ఎన్నో అనుభవాలు నేర్పిందన్నారు. బాబు ఎన్ని విన్యాసాలు చేసినా ఆ పార్టీ ఇక కోలుకోలేదని రామచంద్రయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్‌ ఢిల్లీలో పర్యటిస్తుంటే.. చంద్రబాబు మతి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. జగన్‌ ఢిల్లీ వెళ్లి తనపై మోదీకి ఫిర్యాదు చేశారని బాబు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు చంద్రబాబు దేనికి భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బాబు వ్యవహారం చూస్తుంటే అసలు బాబు మానసిక స్థితి సరిగా ఉందా అనే అనుమానం కలుగుతోందని సీఆర్ తనదైన శైలి వ్యాఖ్య కూడా చేశారు.
Tags:    

Similar News