విధేయత అంటే వీరిదే...మరి మంత్రులు అవుతారా...?

Update: 2022-03-28 03:38 GMT
విధేయత, చిత్తశుద్ధి, అంకిత భావం లాంటి పడికట్టు పదాలు వర్తమాన  రాజకీయాలలో  చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. నిజానికి అధినేతలకు, పార్టీలకూ  అన్నీ బాగున్న వేళ విధేయత అంటే దానికి అర్ధం ఉండదు, అది కేవలం భజనగానే చూడాలి. అలాగే అర్ధం చెప్పుకోవాలి. కాని కాలంలో ఎవరూ లేని కాలంలో వెంట ఉన్నవారే అసలైన విధేయులు. కష్టాల్లో కలసి వచ్చిన వారే నమ్మిన బంట్లు.

అలా కనుక చూసుకుంటే ఉత్తరాంధ్రా జిల్లాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు విధేయతకు మారుపేరుగా చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి తొమ్మిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు.  ఆ తరువాత వారిలో చాలా మంది టీడీపీలో చేరిపోయారు. అయినా గట్టిగా నిలబడిన వారూ ఉన్నారు.  అది కనుక ఆలోచిస్తే విశాఖ నుంచి గెలిచిన వారిలో చూసుకుంటే అరకు, పాడేరు ఎమ్మెల్యేలు కిడార్ సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిపోయినా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాత్రం పార్టీ మారను అంటే మారను అని నాడు గట్టిగా నిలబడ్డారు.

ఆయనే ఒక దశలో చెప్పుకున్నారు. తనకు టీడీపీ పెద్ద ఎత్తున ధన ప్రలోభాలకు గురి చేసిందని, కానీ తాను లొంగలేదని, జగన్ తోనే ఉంటానని చెప్పానని, అదీ విధేయత అంటే. మరి ఆయన మంత్రి రేసులో ఉన్నారు. బీసీ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన మినిస్టర్ అవుతారా అంటే చూడాలి.

ఇక విజయనగరం జిల్లాలో బొబ్బిలి వంశీకులు సుజయ క్రిష్ణ రంగారావు వంటి వారు పార్టీ మారారు. ఆ టైం లో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరకు కూడా భారీ ఆహ్వానం వచ్చింది. అయినా ఆయన వైఎస్సార్ నా దేవుడు, జగన్ తోనే జీవితమంతా అని అలాగే ఒట్టేసుకుని అలాగే ఉండిపోయారు. ఇపుడు రాజన్నదొర మంత్రి కావాల్సిందే అని క్యాడర్ అంటోంది. కానీ లిస్టులో పేరుంటుందా.

ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు  విశ్వరాయి కళావతి, కబాల జోగులు కూడా జగన్ అంటే అమిత ప్రేమ చూపారు. విపక్షంలో ఉన్నపుడు పెద్ద ఎత్తున వారిని ఆకర్షించడానికి అప్పటి టీడీపీ నేతలు చూశారని అంటారు. అయినా వారు ససేమిరా అని పార్టీ కోసమే పనిచేశారు. మరి ఈ ఇద్దరిలో ఎవరికైనా మంత్రి పదవి దక్కుతుందా. విధేయతకు, విశ్వసనీయతకు పెద్ద పీట వేయాలీ అంటే వీరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కినా కూడా టోటల్ గా వైసీపీ క్యాడర్ సంతోషిస్తుంది అనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News