మహిళా వలంటీర్ కు అర్ధరాత్రి ఫోన్ చేసి నీచం.. తహసీల్దార్ సస్పెండ్

Update: 2021-07-05 05:42 GMT
చేసేది అవినీతి.. దాన్ని నిలదీస్తే తిట్టు..  మహిళా వలంటీర్ అని కూడా చూడకుండా ఫోన్లు చేసి అర్ధరాత్రి వేళ బండ బూతులు.. అధికారి అన్న సోయి మరిచిపోయిన తహసీల్దార్ కు తగిన శాస్తి జరిగింది..

ఆమె ఒక మహిళా వాలంటీర్. ఆమె పై అధికారి తహసీల్దార్. అయితే ఎంత అధికారి అయినా అర్ధరాత్రి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడితే ఏమవుతుంది? పోస్ట్ ఊస్ట్ అవుతుంది. అదే జరిగింది.. ఇంటిపట్టాల కోసం భారీగా డబ్బులు తీసుకొని అనర్హులను ఎంపిక చేసినట్లు ఆ తహసీల్దార్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ విషయం ఫిర్యాదు చేసిందన్న నెపంతో మహిళా వాలంటీర్ పై కక్ష పెంచుకున్న తహసీల్దార్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది.

గుంటూరు జిల్లా చేబ్రోల్ మండల ఎమ్మార్వో ప్రభాకర్ పై అవినీతి ఆరోపనలు రావడం.. మహిళా వలంటీర్ ను అర్థరాత్రి 22 సార్లు ఫోన్ చేసి నీచంగా తిట్టడంతో విచారణ జరిపిన కలెక్టర్ సస్పెండ్ చేశారు.

జగనన్న ఇంటి పట్టాల మంజూరులో భారీ అవకతవకలకు పాల్పడినట్టు తహసీల్దార్ పై ఆరోపణలు వచ్చాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందిన అనర్హులకు డబ్బులు తీసుకొని ఇంటి పట్టాలు మంజూరు చేశారనే.. డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతోనే అర్హులకు ఇంటి పట్టాలు రాకుండా అడ్డుకున్నారని లబ్ధిదారులు ఆరోపించారు.

సదురు మహిళా వాలంటీర్ ఎమ్మార్వో అక్రమాలను వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య, కలెక్టర్ కు ఫిర్యాదు చేసిందని తహసీల్దార్ పగ పట్టాడు. తహసీల్దార్, అతడి సోదరుడు, లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు, రత్నారెడ్డి అనే వ్యక్తులు మహిళా వలంటీర్ కు ఫోన్ చేసి అసభ్యకరంగా దూషించారనే ఆరోపణలున్నాయి. అర్ధరాత్రి 22 సార్లు ఫోన్ కాల్స్ చేసి తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది.

ఇక తహసీల్దార్ తీరుపై అధికార వైసీపీ నేతలు కార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ విచారణ జరిపారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన ఓ మహిళా వాలంటీర్ ఫిర్యాదుతో తహసీల్దార్ ను కలెక్టర్ సస్పెండ్ చేసినట్టు సమాచారం.
Tags:    

Similar News