బ్యాన్ ఉన్నా బయట నుంచి బీఫ్ తెచ్చుకోవచ్చట

Update: 2016-05-07 05:45 GMT
దేశాన్ని ఒక ఊపు ఊపేసిన వివాదాల్లో బీఫ్ మీద నిషేధం ఒకటిగా చెప్పొచ్చు.  ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా రచ్చ రచ్చగా మారటమే కాదు.. తినే తిండి విషయంలోనూ పరిమితులు పెడతారా? అన్న వాదన ఒకవైపు.. తిండి అలవాట్లతో ఎదుటోళ్ల మనోభావాల్ని దెబ్బ తినేలా వ్యవహరిస్తారా? అన్న ప్రశ్న మరోవైపు జోరుగా వాదనలు జరగటం తెలిసిందే. ఈ వివాదం ఇలా ఉన్న సమయంలోనే కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ అమ్మకాల్ని బ్యాన్ చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

అయితే.. ఇలా బ్యాన్ చేసిన రాష్ట్రాలకు సంబంధించి ఒక ధర్మ సందేహం తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో బీఫ్ మీద బ్యాన్ ఉన్న నేపథ్యంలో.. బయట రాష్ట్రాల నుంచి బీఫ్ ను తెచ్చుకోవటం అక్రమం కాదంటూ బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.మహారాష్ట్రలో బీఫ్ అమ్మకాల మీద నిషేధం ఉన్న నేపథ్యంలో.. దాన్ని తినాలని భావించే వారు బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకోవచ్చా? అన్న సందేహం కోర్టు ముందుకు వెళ్లింది.

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. బయట  ప్రాంతాల నుంచి తెచ్చుకోవటం చట్టవిరుద్ధం కాదని తేల్చింది. మహారాష్ట్రలో అమలవుతున్న బీఫ్ బ్యాన్ ను ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు.. రూ.10వేలు ఫైన్ వేస్తారు. బాంబే హైకోర్టు తీర్పు విన్నాక కలిగే సందేహం ఏమిటంటే.. ఒక రాష్ట్రంలో ఏదైనా అంశం మీద బ్యాన్ ఉన్నప్పుడు.. పక్క రాష్ట్రం నుంచి సదరు బ్యాన్ ఉన్న వస్తువును తెచ్చి వినియోగించుకోవటం తప్పుకాదన్న మాటే కరెక్ట్ అయితే.. మద్యనిషేధం ఉన్న రాష్ట్రాల్లోని వారు కూడా.. అలా లేని రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తెచ్చుకొని తాగేయొచ్చా? అలా చేస్తే.. చట్టవిరుద్ధం కాదా? అన్నది ప్రశ్న. మరి.. ఇలాంటి ధర్మసందేహాల్ని తీర్చే వారెవరు..?
Tags:    

Similar News