నారా లోకేష్..'యువ‌గ‌ళం' వినిపించేనా?

Update: 2023-01-05 10:19 GMT
టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ఈ నెల 27 నుంచి 'యువ‌గ‌ళం' పేరిట పాద‌యాత్ర ప్రారంభిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ యాత్ర‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. ఈ నెల 27న ప్రారంభించే పాద‌యాత్ర‌.. కుప్పం నుంచి సిక్కోలు వ‌ర‌కు మొత్తం 400 రోజుల పాటు 4000 కిలో మీట‌ర్ల లెక్క‌న ముందుకు సాగ‌నుంది. ఇక‌, ఈ యాత్ర‌కు సంబంధించిన పూర్తి ప్ర‌ణాళిక‌ను రూపొందించే ప‌నిలో నాయ‌కులు ఉన్నారు.

ఇదిలావుంటే.. ఈ యాత్ర‌ను ప్ర‌క‌టించే నాటికి.. ఇప్ప‌టికి మ‌ధ్య అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకు న్నాయి. రాష్ట్రంలో జీవో-1/2023 పేరిట ప్ర‌భుత్వం బ‌హిరంగ స‌భ‌లు, రోడ్డు షోల‌పై నిషేధం విధించింది.

అంటే.. పాద‌యాత్ర స‌మ‌యంలో రోడ్డు షోలు, స‌భ‌ల‌కు అవ‌కాశం లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోం ది. కానీ, వాస్త‌వానికి  యువ‌గ‌ళం షెడ్యూల్ ప్ర‌కారం.. పాద‌యాత్ర‌లో రోడ్ షోలు, స‌భ‌లు, స‌మావేశాలు ఇలా అనేక రూపాల్లో కార్య‌క్ర‌మాలు ఉన్నాయి.

అంతేకాదు.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఒక బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని కూడా నారా లోకేష్‌.. పార్టీ సీనియ‌ర్లు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఆయా కార్య‌క్ర‌మాల‌కు ప‌క్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నా రు. యువ‌త‌ను ఎక్కువ‌గా ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌డు ఏపీ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన జీవో  పెద్ద ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇటీవ‌ల గుంటూరు, కందుకూరుల్లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లు, మ‌ర‌ణాల నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు బ‌హిరంగ స‌భ‌లు, ర్యాలీల‌పై ఉక్కుపాదం మోపుతోంది. అయితే.. దీనిని ప్ర‌తిప‌క్షాల కోస‌మే అమ‌లు చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తున్నా.. స‌ర్కారు మాత్రం ప్ర‌జ‌ల కోస‌మేన‌ని చెబుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌కు, రోడ్ షోకు కూడా పోలీసులు అనుమ‌తించ‌లేదు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నారా లోకేష్ యువ‌గ‌ళం రాష్ట్రంలో వినిపించేనా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.  వాస్త‌వానికి యువ‌గ‌ళం ద్వారా.. పార్టీకి ఒక ఊపు తీసుకువ‌చ్చి.. నారా లోకేష్ రాజ‌కీయ భ‌విత‌వ్యానికి మేలిమి మ‌లుపు ఇవ్వాల‌ని పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. అయితే.. రాష్ట్రంలో ప‌రిస్థితి మాత్రం ఒక్క‌సారిగా మారిపోయింది. ఈ క్ర‌మంలో యువ‌గ‌ళం ఎలా ముందుకు సాగుతుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News