తమిళులకు ఎక్కడో తగిలే మాట అనేశాడు

Update: 2017-02-26 05:52 GMT
సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా వ్యవహరించిన వారు ఇలా కూడా మాట్లాడతారా? అన్న సందేహం కలిగేలా ఉంటాయి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మాటలు వింటే. వివాదాస్పద వ్యాఖ్యల్ని తరచూ చేసే ఆయన తీరుతో..ఆయన మాటలు తరచూ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. విషయం ఏదైనా.. మనసులో అనిపించింది అనిపించినట్లు మాట్లాడేసే కట్జూ తాజాగా తమిళులకు ఎక్కడో తగిలే మాటల్ని అనేశాడు.

తమిళుల్ని ఉద్దేశించి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అమ్మ మరణంతో తమిళనాడు అధికారపక్షంలో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యల్ని చూస్తే.. చిన్నమ్మపై ఆయన ఆగ్రహాన్ని ఎంతమాత్రం దాచుకోలేదని చెప్పాలి.

తమిళ ప్రజల భావోద్వేగాల్ని స్పృశించే వ్యాఖ్యలు చేసిన కట్జూ మాటల్ని చూస్తే.. ‘‘ఓ జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడుకు ముఖ్యమంత్రిని చేశారు. పౌరుషం గల తమిళ ప్రజలుగా మీరు దీనిని అంగీకరించటం.. అచేతనులుగా ఉండటం సిగ్గుచేటు. కుట్రకు దాసోహం కావటాన్ని మీ పితృదేవతలు హర్షించరు. ఈ ముఖ్యమంత్రికి శిరసు వంచటం మీకు అవమానం కాదా? గతంలో నేనొక తమిళుడినని గర్వంగా చెప్పుకొన్నాను. కానీ పళని స్వామి సీఎంగా ఉన్నంత కాలం తమిళ వీరాభిమానిగా ఉండలేను. దీనికన్నా చనిపోవటమే మేలు’’ అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.

ఇప్పటికే చిన్నమ్మ.. ఆయన విధేయుడి సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తమిళులకు కట్జూ మాటలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉంటాయనటంలో సందేహం లేదు. భావోద్వేగాల్ని టచ్ చేసేలా.. సూటిగా తమిళులకు తగిలేలా ఉన్న కట్జూ మాటల ప్రభావం తమిళుల మీద ఎంతలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. మరి.. దీనిపై తమిళుల స్పందన ఏమిటో కాలమే తగిన సమాధానం ఇస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News