అమ్మకానికి కేర్ హాస్పిటల్స్.. ఎందుకు అమ్మాలనుకుంటున్నారు?

Update: 2022-01-31 05:30 GMT
కేర్ హాస్పిటల్ అన్నంతనే.. మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు.. సుశిక్షితులైన.. నిపుణులైన డాక్టర్లు బోలెడంతమంది ఉంటారు. పెద్ద హాస్పిటళ్ల జాబితాలో ఈ ఆసుపత్రులు కనిపిస్తాయి. అలాంటి కేర్ హాస్పిటల్ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. మూడేళ్ల క్రితం దీన్ని సొంతం చేసుకున్న ఎవర్ కేర్ దీన్ని అమ్మేయాలని భావిస్తోంది. ఎందుకిలా? మంచి లాభాల్ని గడిస్తుందని పేరున్న కేర్ ఆసుపత్రిని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

కేర్ ఆసుపత్రి అన్నంతనే హైదరాబాద్ కేంద్రంగా నెలకొల్పిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. 1997లో వంద పడకల సామర్థ్యంతో నెలకొల్పిన ఈ కార్డియాక్ ఇన్ స్టిట్యూట్ ను కొద్ది మంది కార్డిక్ నిపుణులు కలిసి ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ ఆసుపత్రి చైన్ కు ఐదు రాష్ట్రాల్లోని ఆరు నగరాల్లో 12 ఆసుపత్రులు ఉన్నాయి. ఎవర్ కేర్ వెబ్ సైట్ ప్రకారం.. ఈ ఆసుపత్రుల సామర్థ్యం 2వేల పడకలు. కార్డియాక్ సైన్సెస్.. అంకాలజీ.. న్యూరో సైన్సెస్.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ.. ఆర్థోపెడిక్స్.. వాస్క్యులర్ సర్జరీ.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సేవల్ని ఈ ఆసుపత్రులు అందిస్తున్నాయి.

అయితే.. ఈ ఆసుపత్రులకు సంబంధించి 72 శాతం వాటాను 2016లో ఎమిరేట్స్ కు చెందిన అబ్రాజ్ కంపెనీ రూ.2వేల కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. ఈ కొనుగోలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. మరి.. ముఖ్యంగా హెల్త్ కేర్ మార్కెట్లో జరిగిన ఇంత భారీ డీల్ పై రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. అయితే.. ఎక్కువ ధరకు కొన్నామన్న ఆలోచనలో అబ్రాజ్ రావటం.. అనంతరం వారు ఊహించిన దానికి భిన్నంగా పరిస్థితులు చోటు చేసుకున్నట్లు చెబుతారు. నిధుల అవకతవకలకు పాల్పడటంతో దుబాయ్ కు చెందిన ఈ సంస్థ పతనమైంది. అనంతరం 2019లో ఈ సంస్థ పగ్గాల్ని ఎవర్ కేర్ గ్రూప్ చేతికి వెళ్లాయి.

కొవిడ్ కారణంగా ఆరోగ్య సంరక్షణ రంగానికి గిరాకీ ఏర్పడటం.. ఇందులో పెట్టుబడులు పెట్టటానికి పలువురు ఆసక్తిని చూపిస్తున్న వేళ.. తమ చేతిలో ఉన్న కేర్ హాస్పిటల్ గ్రూప్ ను అమ్మేయటం మంచిదన్న ఆలోచనలో టీపీజీకి చెందిన ఎవర్ కేర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వేలం ప్రక్రియ ద్వారా ఈ డీల్ ను క్లోజ్ చేసేందుకు వీలుగా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు బార్ క్లేస్.. రాత్స్ చైల్డ్ లను నియమించినట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన లావాదేవీలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా త్వరలోనే కేర్ హాస్పిటల్స్ కొత్త యాజమాన్యం తెర మీదకు రానుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News