ఎస్‌ బీఐ చార్జీల‌పై హైదరాబాదీ కేసు..

Update: 2017-12-06 07:49 GMT
సామాన్యుడి జేబు చిల్లులు పెట్ట‌డం..అది అత్యంత అందంగా ట్రానాక్ష‌న్స్ చార్జీల పేరుతో జేబు గుల్ల చేయ‌డంలో బ్యాంకు మించిన‌దేదీ లేద‌నేది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే ఇలా ఇబ్బందులు ప‌డ్డ వారు ఎందరో. అలా హిడెన్ చార్జీల వ‌ల్ల షాక్‌ కు  గురైన ఓ శ‌ర్మ‌గారు త‌న దుర‌దృష్టం అనుకోని ఊరుకోలేదు. ఏకంగా బ్యాంకు నిర్వాకంపై కోర్టును ఆశ్ర‌యించారు. ఆస‌క్తిరంగా ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా న‌మోదు చేశారు. ఇలా వినియోగ‌దారునికి ట్విస్ట్ ఇచ్చిన ఆ బ్యాంకు ఎస్‌ బీఐ కాగా...బ్యాంక్ కు షాకిచ్చిన ఆ వినియోగ‌దారుడు హైద‌రాబాదీ.

వివ‌రాల‌లోకి వెళితే....అనుమతి లేకుండా వినియోగదారుడి ఖాతా నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులను చార్జీల పేరు(హిడెన్ చార్జీలు)తో అకౌంట్ నుంచి కట్ చేస్తున్న బ్యాంకుపై కోర్టు ఆదేశాల మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్‌ కు చెందిన కృష్ణమోహన్ శర్మ స్థానికంగా పౌరహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏఎస్‌ రావునగర్ ఎస్‌ బీఐ బ్రాంచిలో శ‌ర్మ‌ సేవింగ్ ఖాతా ఉంది. కాగా.. ఈ నెల మొదటి వారంలో చార్జీల పేరుతో అకౌంట్ నుంచి రూ.150లు కట్ కావడంతో వెంటనే బ్యాంకు అధికారులను సంప్ర‌దించారు. స్టేట్‌ మెంట్ తీసుకున్నందుకు ఫీజ్ కింద కట్ చేశామని అధికారులు తెలిపారు. అయితే తాను ఎలాంటి స్టేట్‌ మెంట్ తీసుకోలేదని ఖాతాదారుడు చెప్పినప్ప‌టికీ... బ్యాంకు అధికారులు త‌మ‌దైన శైలిలో పొంతనలేని సమధానం చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

దీంతో శ‌ర్మ‌గారికి మండిపోయింది. బ్యాంక్ ఉన్నతాధికారులకు - ఆర్‌ బీఐ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే ఫలితం లేకపోవడంతో మల్కాజిగిరి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ వేశాడు. దీంతో కేసు స్వీకరించిన కోర్టు బ్యాంకుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నివేదికను అందించాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు పోలీసులు ఏఎస్‌ రావునగర్ ఎస్‌ బీఐ బ్యాంకుపై ఐపీసీ 405 - 406 - 409 సెక్షన్‌ ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News