ఏపీలోనూ బాబు మీద కంప్లైంట్

Update: 2015-07-15 11:00 GMT
ఇవాళ.. రేపటి రోజున పోలీస్ కంప్లైంట్ అన్నది చాలా మామూలైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేసులు నమోదు చేసుకోవటం సర్వసాధారణంగా మారింది. రాజకీయ విభేదాలు కావొచ్చు.. ఏ అంశంలో నచ్చకున్నా పోలీసులకు ఫిర్యాదులు చేసేస్తున్నారు.

మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయమనంతో ఉండాలని.. ఇరువురు రెచ్చగొట్టే పనులు చేయొద్దంటూ హితవు పలికి.. ఏపీ ఎంపీలను విమర్శలతో కడిగిపారేయటం తెలిసిందే.

అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పవన్ కల్యాణ్ ఏ హోదాలో విమర్శలు చేస్తారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పుడు పరిస్థితి అలా మారింది. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు విమర్శల చిక్కుల్లో ఇరుక్కుపోవటం తెలిసిందే. తాజాగా తొక్కిసలాట ఘటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం నేతలు ఆరోపించటమే కాదు.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖపట్నంలో ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరస్నానం చేసేందుకు వచ్చి.. సాధారణ ప్రజలను అనుమతించటంలో జాప్యం జరగటం వల్లే తొక్కిసలాట జరిగిందని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆసక్తికర కోణం ఏమిటంటే.. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోముఖ్యమంత్రి మీద తప్ప మిగిలిన అందరి మీదా కంప్లైట్లు ఎక్కువగా నమోదు అవుతుంటాయి. ఆంధ్రాలో మాత్రం అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి మీద ఎలాంటి మొహమాటం లేకుండా ఫిర్యాదులు ఇచ్చేస్తున్న పరిస్థితి.
Tags:    

Similar News