అమ్మ రాజ్యంలో అలానే ఉంటుంది మరి..

Update: 2016-08-22 04:57 GMT
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ రాష్ట్ర రాజకీయాల్లో  పగ.. ప్రతీకారం లాంటివి చాలానే కనిపిస్తాయి. విపక్షాల పట్ల అధికారపక్షం కఠినంగా వ్యవహరించటం కూడా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన రాజకీయ పక్షాలు ఏవీ అతీతం కావు. తాము అదికారంలో ఉంటే చాలు విపక్షాన్ని ముప్ప తిప్పలుపెట్టి మూడు చెరువులు తాగించటం ఆ రాష్ట్రంలో మామూలే. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విపక్ష డీఎంకే నేతల తీరుపై పాలకపక్షం మండిపడటం.. వారిపై సస్పెండ్ వేటు వేయటం తెలిసిందే. ఈ నెల 18న జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాలక అన్నాడీఎంకే.. ప్రతిపక్ష డీఎంకే సభ్యుల మధ్య పోటాపోటీ వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో డీఎంకేకు చెందిన సభ్యుల్ని ఏడురోజులు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సస్పెండ్ అయిన డీఎంకే నేతలకు ఆ పార్టీ ముఖ్యనేత స్టాలిన్ నాయకత్వం వహిస్తూ.. ఈ నెల 19న అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. అధికారపక్షంపై నిరసన వ్యక్తం చేసే పనిలో భాగంగా ఇలాంటివి మామూలే. కానీ.. దీన్ని కూడా అమ్మ జయలలిత సీరియస్ గా తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీపై కన్నెర్ర చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 60 మంది ఎమ్మెల్యేపై తాజాగా కేసులు పెట్టారు. అనుమతి లేకుండా సెక్రటేరియట్ లోకి ప్రవేశించినందుకు సెక్షన్ 188 కింద కేసులు పెట్టిన పోలీసులపై విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలకు కూడా కేసులు పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అమ్మ రాజ్యంలో నిరసన చేయాలనుకోవటం చిన్న విషయం కాదుగా. మాక్ అసెంబ్లీ నిర్వహించి అధికారపక్షాన్ని ఎటకారం చేసుకుంటే అమ్మకు ఆ మాత్రం ఆగ్రహం రాకుండా ఉంటుందా..?
Tags:    

Similar News