సారును అలా తిట్టేస్తే.. కేసు బుక్ కాదా ఏంటి?

Update: 2019-09-10 11:31 GMT
కొద్ది రోజులుగా వాట్సాప్ లో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి దారుణమైన రీతిలో తిట్టేసిన ఒక మహిళ తిట్ల పురాణం విని చాలామంది షాక్ తిన్నారు. యూరియా కొరత నేపథ్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆమె..కేసీఆర్ ను ఉద్దేశించి భారీ దూషణలకు దిగింది.

చాలామంది ఈ వీడియోను చూసినంతనే దాన్ని డిలీట్ చేశారు. అయినప్పటికీ.. సదరు వీడియో భారీగా వైరల్ అయ్యింది.  ఇంతకీ.. సీఎంను అంతలా దూషించిన ఆ మహిళ ఎవరు?  ఆమె వివరాలేమిటన్న విషయాలు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఆ వీడియో బయటకువచ్చిన కాసేపటికే వెల్లడయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్ లో యూరియా కొరత నేపథ్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న లక్ష్మీ అనే మహిళ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అసభ్య పదజాలంతో భారీగా తిట్లవర్షం కురిపించారు.

తన సొంత గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ.10లక్షల మేర ఆర్థిక సాయం చేసిన కేసీఆర్.. రాష్ట్రంలోని మిగిలిన రైతుల్ని మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదన్న ఆక్రోశాన్ని హద్దులు దాటేసే మాటల్ని వాడేశారు. కరెంటు బిల్లుల్ని కూడా భారీగా పెంచేసినట్లు ఆమె మండిపడ్డారు. పంటకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఉందన్న ఆమె.. మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ టీఆర్ఎస్ నేత చాంద్ భాషా చేసిన కంప్లైంట్ తో ఆమెపై పోలీసులు కేసు బుక్ చేశారు. ముఖ్యమంత్రిని తప్పు పట్టటాన్ని ఎవరూ కాదనలేరు.. కానీ.. హద్దులు దాటిన ఆగ్రహంతో వ్యాఖ్యలు చేయటం తిప్పలు తప్పవన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మానదు.
Tags:    

Similar News