నోట్ల కొర‌త‌పై కొత్త డేట్ చెప్పిన మోడీ మ‌నిషి

Update: 2016-12-17 04:24 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు - క‌రెన్సీ క‌ష్టాలు తీర‌డంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలో ప‌నిచేసే నీతి అయోగ్ కొత్త మాట చెప్పింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా తలెత్తిన నగదు కొరత కష్టాలు సంక్రాంతి(జనవరి మధ్య) నాటికల్లా తీరిపోతాయని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు రావడం తప్పదని అమితామ్ కాంత్ అన్నట్లు ప్ర‌ముఖ వ్యాప‌ర విభాగం ఫిక్కీ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చాలని అనుకొంటున్న ప్రభుత్వం వివిధ రంగాల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశమున్న అన్ని మార్గాలను గుర్తించడం కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి అమితాబ్ కాంత్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

కొత్త నోట్ల కొర‌త‌ను సంక్రాంతిలోగా తీర్చేసేందుకు కృషిచేస్తున్న‌ట్లుగా తెలిపిని అమితాబ్ కాంత్ ఈ సంద‌ర్భంగా డిజిట‌ల్ లావాదేవీల‌పై కొత్త విశ్లేష‌ణ చేశారు. వంద కోట్ల బయోమెట్రిక్ ప్రమాణీకరణలు - వంద కోట్ల మొబైల్ ఫోన్లు ఉండే ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో భారత్ ఒక్కటేనని పేర్కొన్నారు. ‘త్రిమూర్తులు’గా అభివర్ణించే జన్‌ ధన్- ఆధార్-మొబైల్‌ లను సక్రమంగా వినియోగించుకోగల డిజిటలైజేషన్ మౌళిక సదుపాయాలు దేశంలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఆధార్ ఆధారంగా జరిపే చెల్లింపులు దేశంలో వచ్చిన అతిపెద్ద ప్రకంపన అని ఆయన అంటూ, మొబైల్ ఫోన్ కనెక్షన్లు లేని దాదాపు 30 కోట్ల మంది డిజిటల్ చెల్లింపులకోసం ఆధార్‌ ను - బొటనవేలి గుర్తులను లేదా ఐరిస్ కనెక్షన్‌ ను ఉపయోగించుకోవచ్చని అమితాబ్ కాంత్‌ చెప్పారు. రాబోయే ఆరేడు నెలల్లో స్మార్ట్ ఫోన్‌ ను వాడే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ఆధారిత చెల్లింపులు జరపవచ్చని ఆయన అన్నారు. అంతేకాదు దేశం డిజిటైజేషన్ చెల్లింపుల దిశగా ముందుకు సాగిన కొద్దీ లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని కూడా ఆయన అన్నారు.

దేశంలోని దాదాపు 80 శాతం లావాదేవీలన్నీ కూడా పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ పైనే జరిగేలా చూసేందుకు కచ్చితమైన గడువుపై ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేసే దిశగా కమిటీ ముందుకు సాగుతోందని అమితాబ్ కాంత్ చెప్పారు. నిలకడగా 7.5 శాతం వృద్ధి రేటును సాధించాలంటే డిజిటలైజేషన్ తప్పనిసరని, ఎందుకంటే పెద్ద మొత్తంలో సాగే లావాదేవీల కారణంగా ఉత్పన్నమయ్యే సమాంతర ఆర్థిక వ్యవస్థను భరించే స్థితిలో దేశం లేదని అమితాబ్ కాంత్ స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది.  డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రకటించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజి ధన్ వ్యాపారి యోజన లాంటి ప్రోత్సాహక పథకాల గురించి అమితాబ్ కాంత్ వివరిస్తూ, వ్యాపారులు డిజిటైజేషన్‌కు మారేటప్పుడు పన్ను అధికారులనుంచి వారికి క్రితం సంవత్సరాల ఖాతా పుస్తకాల స్క్రూటినీలాంటి వేధింపులు ఏవీ ఉండవని హామీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News