వివేకా మర్డర్ కేసులో సీబీఐ విచారణ పూర్తవుతుందా ?

Update: 2021-12-03 01:30 GMT
వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విచారణ చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. మర్డర్ కేసు విచారణలో రోజుకో సాక్ష్యం, రోజుకో ఆరోపణ బయటకు వస్తోంది. తాజాగా హత్య జరిగిన రోజున పులివెందుల సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పనిచేసిన జే. శంకరయ్య ప్రస్తుత జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు రాసినట్లుగా ప్రచారంలో ఉన్న ఓ లేఖ వెలుగుచూసింది. ఇందులో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై సీఐ చాలా ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తదితరుల ప్రమేయం ఉందన్నట్లుగా నిందితులతో చెప్పించాలని తనపై బాగా ఒత్తిడి చేసినట్లుందట.

హత్య జరిగిన వెంటనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవటంలోను, హత్యా స్థలంలో సాక్ష్యాలను కాపాడటంలోను శంకరయ్యను ప్రభుత్వం అప్పట్లో సస్పెండ్ చేసింది. అలాగే వివేకా మృతదేహాన్ని ఇంట్లో నుంచి ఆసుపత్రికి తరలించేసమయంలో కూడా సీఐ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. హత్య కేసు నిందితుల్లో ఒకడైన శంకరరెడ్డి మద్దుతుదారుడు గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీ ఫకీరప్పను కలిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గంగాధరరెడ్డి కూడా సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేశారు.

తాజాగా శంకరయ్య కూడా అలాంటి ఆరోపణలే చేశారు. ఇదంతా చూస్తుంటే వివేకా మర్డర్ కేసు విచారణలో సీబీఐ అసలు ముందుకు వెళుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  సీబీఐ విచారణ ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుంది. ఇలాంటి నేపధ్యంలోనే ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఐదుగురు నిందితులు కూడా ఏదో కారణాలతో బెయిల్ పై విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మొత్తం మీద రోజుకో మలుపు తిరుగుతుండటంతో వివేకా మర్డర్ కేసులో అసలు నిజాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకళ్ళేమో ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, శంకరరెడ్డి, సునీల్ యాదవే వివేకాను హత్య చేసినట్లు చెబుతారు. గంగాధరరెడ్డి లాంటి వాళ్ళేమో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించినట్లు ఆరోపిస్తారు. ఇదే నిజమైతే రాజశేఖరరెడ్డి భార్య, వివేకా కూతురు సునీత ఎందుకని సీబీఐ విచారణకు పట్టుబడతారు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

ఆస్తులు, డబ్బు విషయంలో తరచు వివేకాకు అల్లుడికి మధ్య పెద్ద గొడవలే జరిగినట్లు గంగాధర్ చెప్పిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగంలో వివేకా బాగా బిజీగా ఉన్నది కరెక్టే కాబట్టి ఆస్తులు, డబ్బు విషయంలో అల్లుడితో గొడవలు నిజమేనేమో అనే అనిపిస్తోంది. ఎందుకంటే షమీమ్ అనే ముస్లిం మహిళ పేరుతో ఆస్తులు పెడుతున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News