బెయిల్ ఎందుకు ర‌ద్దు చేయ‌ద్దో చెప్పండి: సాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

Update: 2021-08-07 14:30 GMT
వైసీపీ కీల‌క నాయ‌కుడు, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, ఆడిట‌ర్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి సీబీఐ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం బెయిల్‌పై సాయిరెడ్డిని.. స‌ద‌రు బెయిల్‌ను ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దో.. వివ‌రించాలంటూ.. నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తి.. ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో  ఇటీవ‌ల పిటిషన్ వేశారు. అదికార పార్టీలో ఉన్న ఎంపీ సాయిరెడ్డి.. త‌ర‌చుగా.. ఢిల్లీ వెళ్లి. కేంద్ర పెద్ద‌ల‌ను క‌లుస్తున్నార‌ని.. త‌న‌కు ఢిల్లీలోని పెద్ద‌ల‌తో ఉన్న ప‌రిచ‌యాల‌ను అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నార‌ని.. దీనివ‌ల్ల సాక్ష్యులు ప్ర‌భావితం అవుతార‌ని.. ర‌ఘురామ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలోనే సాయిరెడ్డికి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న కోర్టును అభ్య‌ర్థించారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన సీబీఐ న్యాయ‌స్థానం.. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులిచ్చింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆయనను కోర్టు ఆదేశించింది. ఈ నెల 10న విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ జరుపుతుంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన తరపు న్యాయవాదులు వెంకటేశ్‌ సిద్దాని, పీఎస్‌ మూర్తి ఈ నెల 3వ తేదీన పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యసభ ఎంపీగా తనకు కేంద్ర మంత్రులతో సంబంధాలున్నాయంటూ సాక్షులను భయపెడుతున్నారని అందులో పేర్కొన్నారు.

ఇప్పటికే ఆర్థిక నేరాలు, అక్రమాస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌ప‌నై ఇప్ప‌టికే సీబీఐ, ర‌ఘురామ‌, సీఎం జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదుల వాద‌న‌లు ముగిశాయి. దీంతో .. దీనిపై తుది తీర్పును సీబీఐ కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ క్ర‌మంలో తాజాగా సాయిరెడ్డి బెయిల్‌పై కూడా ర‌ఘురామ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం.. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం.. నోటీసులు జారీ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Tags:    

Similar News