ఐసీఐసీఐ బ్యాంక్ కేసులో కీలక మలుపు

Update: 2019-01-28 11:15 GMT
ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసును విచారిస్తున్న అధికారిపై బదిలీ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అవినీతి ఆరోపణల నెపంతో సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మను పదవి నుంచి తొలగించారు. ఇది జరిగి కొన్ని రోజులు గడవకుందే మరో అధికారిపై సీబీఐ బదిలీ వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఐసీఐసీఐ-వీడియోకాన్ కేసును ఎస్పీ సుధాన్షు ధార్ మిశ్రా విచారిస్తున్నారు.. ఈ కేసులో ఐసీఐసీఐ మాజీ బాస్ చందాకొచ్చర్ - ఆమె భర్త దీపక్ కొచ్చర్ - వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేసుకు సంబంధించిన సెర్చ్ ఆపరేషన్లు ఎక్కడక్కడ నిర్వహిస్తున్నారనే కీలక విషయాలను ముందుగానే లీక్ చేస్తున్నారని ఆరోపిస్తూ సీబీఐ సుధాన్షుపై వేటు వేసింది. కొత్త అధికారిగా మోహిత్ గుప్తాను సీబీఐ నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టగానే పలుచోట్ల దాడులు - సోదాలు నిర్వహించారు.

అయితే కేసుకు సంబంధించి మిశ్రా వైఖరి తేడాగా ఉన్నందునే ఆయనపై బదిలీ వేటు వేశామని సీబీఐ సమర్ధించుకుంటున్నప్పటికీ సరైన ఆధారాలను మాత్రం వెల్లడించడం లేదు. ఈ కేసు  ప్రాథమిక విచారణలో జాప్యం చేశారని.. వివరణ కోరగా సమాధానం రాకపోవడంతో కేసు నుంచి తప్పించి రాంచీకి బదిలీ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. అయితే ఇంతకాలం కేసు విషయంలో జాప్యం జరిగితే ఎఫ్ ఐఆర్ ను ఎలా నమోదు చేశారనే ప్రశ్నకు సమాధానాన్ని అధికారులు దాటవేస్తున్నారు. ఎఫ్ ఐఆర్ పై ఏ అధికారి ఆమోద ముద్ర వేశారో అనేది సీబీఐ స్పష్టత ఇవ్వడం లేదు. ఇలా కేసు పలు అనుమానాలకు తావిస్తోంది.

అయితే వీడియోకాన్ గ్రూపునకు రూ.1875 కోట్ల రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న సమయంలోనే చందాకొచ్చర్ మంజూరు చేశారు. అయితే లోనుకు సంబంధించి చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ స్థాపించిన ఎన్ యూపవర్ రెన్యూవబుల్స్ లో వీడియోకాన్ సంస్థ పెట్టుబడులు పెట్టారని.. దీన్ని క్వీడ్ ప్రోకో కింద పరిగణిస్తూ సీబీఐ వీరిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రస్తుతం ఐసీఐసీఐ సీఈఓగా ఉన్న సందీప్ బక్సీ పేరుతోపాటు బ్యాంక్ ఉన్నతాధికారుల పేర్లు కూడా ఎఫ్ ఐ ఆర్ లో సీబీఐ చేర్చింది. బదిలీపై పలు అనుమానాలు వస్తుండటంతో ఈ కేసు సవ్యంగా జరుగుతుందా.? లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరీ ఈ కేసు విషయంలో  సీబీఐ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి మరీ.
Tags:    

Similar News