ర‌ఘురామ‌రాజు దెబ్బ‌ల‌పై సీబీఐ ద‌ర్యాప్తు... ఇప్పుడ‌ప్పుడే లేదు

Update: 2021-05-25 15:34 GMT
వైసీపీ టికెట్ తో త‌న చిర‌కాల వాంఛ తీర్చుకుని, ఆ త‌ర్వాత ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచిన న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్య‌వ‌హారం ఇప్పుడ‌ప్పుడే చ‌ల్ల‌బ‌డేలా లేదు. ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ తీయ‌డంతో పాటుగా ఆయా వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు సృష్టించేలా వ్య‌వ‌హ‌రించార‌ని ర‌ఘురామ‌రాజుపై రాజ‌ద్రోహం కేసులు న‌మోదు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌న‌ను సీఐడీ క‌స్ట‌డీలో ఉండ‌గానే భౌతిక దాడి జ‌రిగింద‌ని, దాంతో త‌న కాలికి గాయాల‌య్యాయ‌ని ఆరోపించాన ర‌ఘురామరాజు పెను క‌ల‌క‌ల‌మే రేపారు. తాజాగా దీనిపై సీబీఐ చేత ద‌ర్యాప్తు చేయించాల‌న్న  ర‌ఘురామ‌రాజు పిటిష‌న్ పై విచార‌ణ‌ను 6 వారాల పాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. అప్ప‌టిదాకా సీబీఐ ద‌ర్యాప్తు మొద‌ల‌య్యే అవ‌కాశాలే లేకుండా పోయాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

త‌న అరెస్ట్ వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టుకు వెళ్లి ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ తెచ్చుకున్న ర‌ఘురామ‌రాజు... పోలీసు క‌స్ట‌డీలో త‌న‌పై జ‌రిగిన దాడిపై సీబీఐ ద‌ర్యాప్తు చేయించాల‌ని కూడా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని  ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు ర‌ఘురామ‌రాజు త‌న‌యుడు భ‌ర‌త్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు  చేశారు. అయితే దీనిపై మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు... త‌దుప‌రి విచార‌ణ‌ను 6 వారాలకు వాయిదా వేసింది. అంతేకాకుండా దీనిపై ప్ర‌స్తుతానికి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేమ‌ని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫ‌లితంగా ర‌ఘురామ‌రాజు కోరిన‌ట్టుగా త‌న‌పై జ‌రిగిన దాడిపై సీబీఐ విచార‌ణ ఇప్పుడ‌ప్పుడే జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు.ఆరు వారాల త‌ర్వాత కూడా ర‌ఘురామ‌రాజు కోరిన‌ట్టుగా సీబీఐ దర్యాప్తున‌కు సుప్రీంకోర్టు అనుమ‌తిస్తుందో?  లేదో?  కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

భ‌ర‌త్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ లో తొలుత ఐదుగురు ప్ర‌తివాదుల‌ను పేర్కొన్నారు. ఆ జాబితాలో కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, సీఐడీచీఫ్ ఉన్నారు. అయితే మంగ‌ళ‌వారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా ప్ర‌తివాదుల జాబితాను రెండుకే కుదించుకుంటున్నామ‌ని, ఈ జాబితా నుంచి ఏపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం జ‌గ‌న్ ను, సీఐడీ చీఫ్ ను తొల‌గిస్తున్నామ‌ని భ‌ర‌త్ త‌ర‌ఫు న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయ‌క‌ముందే... ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది దుష్యంత్ ద‌వే తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఏపీ సీఐడీ అదుపులో ఉండ‌గా.. త‌న‌పై భౌతిక దాడి జ‌రిగింద‌ని ర‌ఘురామ‌రాజు చెబుతుంటే... దానిపై సీబీఐ ద‌ర్యా.ప్తు జ‌ర‌పాలా? వ‌ద్దా? అన్న విష‌యం తేల్చేందుకు జ‌రుగుతున్న విచార‌ణ‌లో ఏపీ ప్ర‌భుత్వం గానీ, సీఐడీ గానీ లేకుండా ఎలా తీర్మానిస్తార‌ని ద‌వే ప్ర‌శ్నించారు. దీంతో ఈ వ్య‌వ‌హారంలో ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌ఫు వాద‌న‌లు విన్న తర్వాత‌నే త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని సుప్రీంకోర్టు పేప్కొంది. దీంతో ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ ద‌ర్యాప్తు ఇప్పుడ‌ప్పుడే జ‌రిగేలా క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News