'క్రిప్టో' క‌థ న‌డ‌వ‌దు.. కేంద్రం ఏం చేస్తోందంటే!

Update: 2021-12-07 05:34 GMT
క్రిప్టో క‌రెన్సీ. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న పెద్ద చ‌ర్చ‌. ఈ క‌రెన్సీని కేంద్రం ఉంచుతుందా? తీసేస్తుందా? అనేది ఇప్పుడు పెద్ద సందేహం.. వ్యాపార, వాణిజ్య వ‌ర్గాల్లో పెద్ద అనుమానం. అంతేకాదు.. దీనిపై కేంద్రంలోని నరేంద్ర మోడీ స‌ర్కారు ఏం చేస్తుంద‌నే ఉత్సుక‌త కూడా పెరిపోయింది.

దీనికి కార‌ణం.. ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై రోజుకొక క‌థ‌నం.. రోజుకొక వార్త ప్ర‌చారంలో ఉండ‌డ‌మే. క్రిప్టో క‌రెన్సీని కేంద్రం కొన‌సాగిస్తుంద‌ని.. ఒక‌వైపు ప్ర‌చారం జ‌రుగుతుంటే.. మ‌రోవైపు.. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ అంగీక‌రించ‌ద‌ని మ‌రికొన్ని వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తున్నాయి. దీంతో వ్యాపార‌, వాణిజ్య వ‌ర్గాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లోల ఉన్నాయి.

తాజాగా.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని ఆమె పేర్కొన్నారు. కేబినెట్‌ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.

ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్‌ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ‘ఆర్బీఐ కరెన్సీ, డిజిటల్‌ కరెన్సీలకు ఆమోదం!, క్రిప్టో ఎస్సెట్‌’.. ఇలా రకరకాల కథనాలు కొన్ని మీడియా హౌజ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి స్పందించారు.

వివిధ అవసరాలకు క్రిప్టో టెక్నాలజీని వినియోగించేందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వనున్న‌ట్టు మంత్రి సీతారామ‌న్ తెలిపారు. అయితే.. దేశీయంగా ఉన్న‌ ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలన్నింటినీ నిషేధిస్తామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయని మంత్రి సంకేతాలు అందించారు.

ఇదిలా ఉంటే బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీని.. అధికారిక కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేం చేయలేదంటూ ఇంతకు ముందు ఆర్థిక మంత్రి స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని బ‌ట్టి.. క్రిప్టో విష‌యంలో కేంద్రం ర‌ద్దు వైపే మొగ్గు చూపుతోంద‌ని.. అయితే, కొన్నిపెద్ద పెద్ద లావాదేవీల‌కు మాత్రం మిన‌హాయింపు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News