అసెంబ్లీల్లో అతివలు ఇంత తక్కువా?.. బాంబు పేల్చిన కేంద్రం!

Update: 2022-12-12 06:59 GMT
ఆకాశంలో సగం.. అన్నింటిలో సగమంటూ మహిళా సాధికారిత గురించి సందర్భం వచ్చిన ప్రతిసారి అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఊకదంపుడు ప్రసంగాలిస్తుంటారు. అయితే ఆచరణకొచ్చేసరికి మాత్రం వీరి మాటలు నీటి మూటలేనని స్పష్టమవుతోంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలు ఎంత మంది సభ్యులుగా ఉన్నారో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు దిమ్మతిరిగే వాస్తవాలను వెల్లడిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం... పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా సభ్యుల సంఖ్య 15 శాతం లోపే ఉండటం అందరినీ విస్మయ పరుస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభల విషయానికొస్తే మహిళా ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం స్థానాల్లో 10 శాతం లోపే ఉండటం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు అసోం, గోవా, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు సహా 19 రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల వాటా పది శాతం లోపే ఉంది.

ఇక ఛత్తీస్‌గఢ్‌ (14.44), ఝార్ఖండ్‌(12.35) పశ్చిమ బెంగాల్‌ (13.70), పంజాబ్‌(11.11), రాజస్థాన్‌(12), ఉత్తరాఖండ్‌(11.43), ఉత్తరప్రదేశ్‌(11.66), బిహార్‌(10.70) శాసనసభల్లో మాత్రం మహిళా సభ్యుల సంఖ్య పది శాతం కంటే అధికంగా ఉండటం విశేషం.

అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల జాతీయ సగటు ఎనిమిది శాతం మాత్రమే ఉండటం గమనార్హం.

ఇక పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభల విషయానికొస్తే మహిళా సభ్యులు సంఖ్య వరుసగా 14.94 శాతం, 14.05 శాతం మాత్రమే ఉంది.

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేఖ్‌ బెనర్జీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తాజాగా ఈ గణాంకాలను వివరించారు.

కాగా ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 8.2 శాతం మంది మహిళలు శాసనసభకు ఎన్నిక కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ లో మాత్రం ఒకే ఒక్క మహిళ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News