లాక్ డౌన్ తర్వాతి పరిణామాలకు కేంద్రం రెడీయేనా?

Update: 2020-04-03 14:30 GMT
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ లో మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దానిని కట్టడి చేసేందుకు హఠాత్తుగా లాక్ డౌన్ విధించక తప్పలేదు. కఠినంగా ఉన్నా కూడా లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తోందని - భారత్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. ఇక, లాక్ డౌన్ అమలవుతోన్న తీరుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 14 తర్వాత దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేస్తే బాగుంటుందని సీఎంలు - పీఎం భావించినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికితోడు ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తివేస్తున్నారంటూ అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ ట్వీట్ చేశారు. అయితే, తాను హిందీలో చెప్పిన విషయం ఆ ట్వీట్ చేసిన అధికారికి అర్థం కాలేదని - అందుకే పొరపాటున ఆ ట్వీట్ చేశారని ఖండూ లాక్ డౌన్ ఎత్తివేత ట్వీట్ ను ఖండించారు.

ఇంత పెద్ద విషయాన్ని ఖండూ అధికారి తప్పుగా ట్వీట్ చేశారని చెప్పడం నమ్మశక్యంగా లేకపోయినా...నమ్మక తప్పదు. ఏతా వాతా...ఒక వేళ ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తివేస్తే...తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి...? జనం అంతా జైలు లో నుంచి విడుదలైన ఖైదీల్లా రోడ్లపైకి వస్తే...పరిస్థితి ఏమిటి అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీకి దేశంలోని సుమారు 800 మంది విద్యా వేత్తలు - ఆరోగ్య రంగంలోని నిపుణులు కొన్ని ప్రశ్నలు సంధించారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏ వ్యూహంతో ముందుకు వెళ్లనుందో తెలుసుకోవాలనుకుంటున్నామని  ఏప్రిల్ 1న ఓ ప్రకటన విడుదల చేశారు.

అంతేకాదు, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే ముఖ్యమైన నిర్ణయాల గురించి ముందే వెల్లడించాలని, తద్వారా ప్రజలు - వ్యవస్థ అందుకు సిద్ధంగా ఉంటారని ఐఐఎఫ్ ఆర్ - ఎన్సీబీఎస్ శాస్త్రవేత్తలు ఐఐటీయన్లు - ఐఐఎస్ ఈఆర్ - ఐఐఎస్సీ ప్రతినిధులు - ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్ మెంట్ ప్రతినిధులు కోరారు. లాక్ డౌన్ తాత్కాలిక పరిష్కారమే నన్న నిపుణులు, కరోనా క్రైసిస్ లో హెల్త్ కేర్ సిస్టమ్ ను ఎలా కాపాడుకోవాలో ఆలోచించేందుకు లాక్ డౌన్ సమయం ఉపయోగపడిందన్నారు. వైరస్ కు లాక్ డౌన్ చికిత్స కాదని, కేవలం ఉపశమనం మాత్రమేనని చెప్పారు. లాక్ డౌన్ తొలగించిన తర్వాత కరోనా మరింతగా విజృంభించే అవకాశముందని హెచ్చరించారు. లాక్ డౌన్ తదనంతర పరిణామాలపై ముందుగానే ఓ అవగాహనకు రావాలని సూచిస్తున్నారు. కరోనా నివారణకు భారత ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు.

కరోనా పాజిటివ్ కేసుల గుర్తింపులో జాప్యం జరుగుతోందని - రక్త నమూనాల పరీక్షలపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు.  లాక్ డౌన్ తరువాత  రివర్స్ మైగ్రేషన్ సమస్య వస్తుందని, లాక్ డౌన్ తర్వాత వలస కూలీలంతా తమ పనుల్లోకి తిరిగి వస్తారని వారి విషయంలో స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాల్సి వుంటుందని సూచించారు. కూలీలు - పేదల పట్ల మానవత్వాన్ని ప్రదర్శిస్తూనే - వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆహార ధాన్యాల నిల్వలను పోలీసుల సాయంతో అవసరమైన వారికి పంచేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని కోరారు.  మరి, వీరి సూచనలను ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి. ఏది ఏమైనా వీరు చెప్పిన దాని ప్రకారం లాక్ డౌన్ తర్వాత పరిస్థితులను ప్రభుత్వం హ్యాండిల్ చేయడం అంత వీజీ కాదని చెప్పవచ్చు.
 


Tags:    

Similar News